అంగన్వాడీలలో పోస్టుల భర్తీ, వేతనాల పెంపుపై మంత్రి సీతక్క గుడ్ న్యూస్!
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు మరియు ఆయాలు చాలా కాలంగా వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని పని చెయ్యాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు శుభవార్త చెప్పారు.
హైదరాబాద్‌లో అంగన్వాడీ టీచర్లు మరియు ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం
మంత్రి సీతక్క కుమురంభీం జిల్లాలో అమ్మమాట-అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. జూపల్లి కృష్ణారావుతో కలిసి రేకులగూడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. జూన్ 6న హైదరాబాద్‌లో అంగన్వాడీ టీచర్లు మరియు ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు.

వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
ఈ సమావేశం తర్వాత వేతనాల పెంపుదలకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించి, తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని, త్వరలోనే అంగన్వాడీల వేతనాల పెంపు చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.అంగన్వాడీ కేంద్రాలు పేదల పిల్లలకు ప్రాథమిక విద్య, పౌష్టికాహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, దీర్ఘకాలంగా వేతనాలు తక్కువగా ఉండటం వల్ల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జీతాల పెంపుపై, ఖాళీల భర్తీపై హామీ ఇచ్చిన మంత్రి సీతక్క
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి జీతాలను సమీక్షించి పెంచడం ద్వారా వారి బాధ్యతను పెంచి, సేవల నాణ్యతను మెరుగుపరచాలని భావిస్తోంది. మంత్రి సీతక్క మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరగా భర్తీ చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఖాళీలు భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాలు సాఫీగా నడపడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
పిల్లల భవిష్యత్తును ఉజ్వలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్న మంత్రులు
ఈ కార్యక్రమంలో మంత్రులు చిన్నారులకు యూనిఫాం పంపిణీ చేసి, అక్షరాభ్యాసం కూడా నిర్వహించారు. పిల్లల పౌష్టికాహారం, కేంద్రం వసతులు గురించి వివరాలు సేకరించారు. అంగన్వాడీలను ఆధునికీకరించి, పేద పిల్లల భవిష్యత్తును ఉజ్వలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు అమలు అయితే, రాష్ట్రంలోని వేలాది అంగన్వాడీ సిబ్బంది ఆర్థికంగా బలపడతారు. ఇది వారి కుటుంబాలకు మేలు చేస్తుంది.
అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు
అంగన్వాడీలు ఉత్సాహంగా చిన్నారులకు మెరుగైన సేవలు అందించడంలో ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం స్త్రీలు మరియు శిశు సంక్షేమ రంగాల్లో చేపట్టుతున్న ఈ చర్యలు సమాజంలో సానుకూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అడుగులు మహిళా సాధికారత మరియు శిశు అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications