డబ్బులు అడగటం తప్పా?, పేపర్లపై సంతకాలు అవాస్తవం: గీత భర్త కిడ్నాప్‌పై తలసాని
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావును తన కొడుకు బెదిరించారన్న ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ బెదిరింపు ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
బిజినెస్ పేరిట తమ వద్ద రామకోటేశ్వరరావు 2011లో రూ. 11 కోట్లు అప్పుగా తీసుకున్నారని అన్నారు. ఆ డబ్బు చెల్లింపు విషయంలో గీత భర్త రామకోటేశ్వరరావు ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారని అన్నారు. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని పక్షంలో వీరిపై సీబీఐ కేసులు కూడా నమోదు చేసిందని గుర్తు చేశారు.
అయితే తమ వ్యాపార భాగస్వాముల నుంచి డబ్బుల కోసం ఒత్తిడులు ఎదురవ్వడంతో అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని తన కుమారుడు రామకోటేశ్వరరావుతో మాట్లాడాడని చెప్పారు. ఈ క్రమంలో తాజ్ కృష్ణ హోటల్‌లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

తాజ్ కృష్ణ హోటల్‌లో ఉన్న లాన్‌లో ఈ సమావేశం జరిగిందని... ఈ సందర్భంగా తన కుమారుడు డబ్బులు అడిగిన నేపథ్యంలో తన పేరిట ఉన్న ఐదెకరాల భూమి పత్రాలను హామీగా పెడతానని రామకోటేశ్వరరావే స్వయంగా చెప్పారని అన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఇంటికి వెళ్లి సదరు భూమి పత్రాలు తెచ్చి రామకోటేశ్వరరావే స్వయంగా ఇచ్చాడని చెప్పారు.
ఈ సందర్భంగా ఓ కాగితంపై సదరు పత్రాలు ఇస్తున్నట్లు రాసిచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అవి రిజిస్ట్రేషన్ కూడా కావని ఆయన తెలిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. కావాలంటే హోటల్‌లో ఉన్న సీసీటీవి పుటేజీలను పరిశీలించుకోవచ్చని అన్నారు.
బిజినెస్ డీల్ కోసం రామకోటేశ్వరరావుని బెదిరించాడని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు రామకోటేశ్వరరావు పన్నాగం పన్ని కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు చేశారని అన్నారు. దీనికి సంబంధించిన మొత్తం ఆధారాలను రేపు మధ్యాహ్నాం బయట పెడ్తానని చెప్పారు.
ఈ విషయంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చిన తలసాని, ఇచ్చిన డబ్బులు అడగటం తప్పా? అని ప్రశ్నించారు. తనతంట తానే పత్రాలను తీసుకొచ్చి ఇచ్చారని... తన కుమారుడు బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించాడన్నది అవాస్తవమని అన్నారు.
డబ్బులు ఇచ్చే వరకు డాక్యుమెంట్లు పెట్టుకోని గీత భర్త రామకోటేశ్వరరావు చెప్పారని అన్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల అధికారులను మోసం చేసిన రామకోటేశ్వరరావు తమను కూడా మోసం చేయాలని చూస్తున్నారని తలసాని ఆరోపించారు. అయితే తమను మోసం చేయడం ఆయన వల్ల కాదని చెప్పారు.
రామకోటేశ్వరరావు వద్ద తీసుకున్న పత్రాలను తాము పోలీసులకు అందజేశామని తెలిపారు. తామిచ్చిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తమకు తెలుసని చెప్పిన తలసాని.... హోటల్ లాన్‌లో జనాల మధ్య కూర్చుంటే కిడ్నాప్ చేశారని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పానని అన్నారు.












Click it and Unblock the Notifications