నరేష్- పవిత్ర లోకేష్- రమ్యా రఘుపతి వ్యవహారంలో కీలక మలుపు..!!
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేష్, ఆయన భార్య రమ్యా రఘుపతి మధ్య వివాదం అనూహ్య మలుపు తిరిగింది. రమ్యాకు వ్యతిరేకంగా నరేష్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె తనను వేధిస్తోందని, హత్య చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఫిర్యదు చేశారు. రమ్యా నుంచి తనకు విడాకులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లైన తొలి రోజుల నుంచే రమ్యా తనను వేధిస్తోందని, ఆమెతో కలిసి జీవించలేనని స్పష్టం చేశారు.

విడాకుల కోసం..
నరేష్.. తన తోటి నటి పవిత్ర లోకేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతోన్న విషయం తెలిసిందే. రమ్యా రఘుపతికి విడాకులు ఇచ్చి.. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఈ మధ్యే నరేష్-పవిత్ర లోకేష్ ఓ వీడియో క్లిప్ ను విడుదల చేశారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని రమ్యా రఘుపతి గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది.

నరేష్ ఇంటిపై దాడి..
ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా నరేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారవాన్, కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై నరేష్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఈ దాడి వెనుక తన భార్య రమ్య రఘుపతి హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తొలుత ఆమె తన ఇంటికి వచ్చి- బెదిరించి వెళ్లిపోయిన కొద్ది సేపటికే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తోన్నారు.

సైబరాబాద్ పోలీసులకు కూడా..
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను కూడా ఆయన ఆశ్రయించారు. తనతోపాటు పవిత్ర లోకేష్ పై రమ్యా రఘుపతి కొన్ని యూట్యూబ్ ఛానళల్లో దుష్ప్రచారం చేయిస్తోందనడానికి ఆధారాలను సమర్పించారు. సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలపై దుష్ప్రచారం చేస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి- మూడు యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తోన్నాయని, దీనికి సంబంధించిన కొన్ని క్లిప్పింగులను సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించానని అన్నారు.

హైకోర్టులో పిటీషన్..
దీనిపై నరేష్ తాజాగా హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రమ్యా రఘుపతి విపరీతంగా మద్యం సేవిస్తుంటారని నరేష్ ఆరోపించారు. తన స్నేహితుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు, పార్టీల్లో తరచూ పాల్గొంటుంటుదని, మద్యం సేవించి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటుందని అన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని నరేష్ పేర్కొన్నారు. తనకు ఉన్న ఆస్తులు, డబ్బు మీదే రమ్యకు వ్యామోహం అధికమని నరేష్ ఈ పిటీషన్ లో పొందుపరిచారు.

హత్యకు రెక్కీ..
తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీలో ఓ పోలీస్ అధికారి కూడా రమ్యా రఘుపతికి సహకరిస్తున్నారంటూ ఇదివరకు నరేష్ ఆరోపించారు. తన ఫోన్ ను హ్యాక్ చేశారని, బ్లాక్‌మెయిల్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన పేరు చెప్పి రమ్యా రఘుపతి చాలామంది వద్ద లక్షల రూపాయలను వసూలు చేసిందని, ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరారు.












Click it and Unblock the Notifications