శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం !
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ రాసిన మేడిపల్లి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి.. ఇంటి నుంచి అదృశ్యమవడం కుటుంబ సభ్యులను కలవరపరిచింది. ఇక యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ సేకరించి యువతి చివరిసారిగా ఎక్కడ కనిపించిందన్న దానిపై దృష్టి సారించారు.
డిప్రెషన్ లేఖతో మిస్టరీ..
కాగా సదరు యువతి తల్లిదండ్రులతో కలిసి మేడిపల్లి ప్రాంతంలో నివసిస్తోంది. అయితే రెండ్రోజుల క్రితం ఆమె ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో వెతికిన సమయంలో కుటుంబ సభ్యులకు ఒక లేఖ కనిపించింది. ఆ లేఖలో తాను డిప్రెషన్‌లో ఉన్నానని.. "తనను శివయ్య పిలుస్తున్నాడు" అని, అందుకే ఆయన దగ్గరకు వెళ్తున్నానని పేర్కొంది.

అయితే దర్యాప్తులో భాగంగా యువతికి గతంలో ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను మందలించారని సమాచారం. ఆ తర్వాత నుంచి ఆమె ఆ యువకుడితో మాట్లాడటం మానేసిందని కుటుంబం చెబుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రేమ వ్యవహారం కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
మానసిక ఒత్తిడి కారణమా?
యువతి లేఖలో డిప్రెషన్ గురించి ప్రస్తావించడంతో, ఆమె మానసిక పరిస్థితి కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయో కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ, ఆమె స్నేహితులు, కాలేజ్ పరిచయాలను కూడా విచారిస్తున్నారు. అలానే యువతి మొబైల్ ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా యాక్టివిటీని పరిశీలిస్తూ ఆమె ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానికుల సహాయంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications