పీసీసీ చీఫ్ వల్లే అక్కడ పార్టీ ఖతమైంది : రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డ జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సమసిపోవడం లేదు. తాజాగా పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల సమావేశం చర్చనీయాంశంగా మారింది. మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో ఇటీవల సీనియర్ నేతలు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వమే కావాలంటూ సమావేశమైనట్లు ఇటీవల స్పష్టత ఇచ్చారు ఆ సీనియర్ నేతలు.

రేవంత్ రెడ్డి, ఠాకూర్లే.. ఆ విషయం చెప్పారంటూ జగ్గారెడ్డి
కానీ, మరోసారి టీకాంగ్రెస్ సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి ఫోన్ చేసి సమావేశం నిర్వహించవద్దన్నారు. అంతేకాకుండా ఏమైనా సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి మేలు చేయాలనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, తాను పార్టీ మారుతున్నానని అధిష్టానంకు ఠాగూర్, రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.

పంజాబ్‌లో పీసీసీ చీఫ్ వల్లే పార్టీ ఖతమంటూ రేవంత్‌పై జగ్గారెడ్డి
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి ఉంటే పార్టీ నడుస్తుందా .? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీల కు అన్ని విషయాలు చెప్తామన్నారు.
పంజాబ్‌లో పీసీసీ చీఫ్ సిద్దుతోనే పార్టీ ఖతం అయ్యిందని జగ్గారెడ్డి పరోక్షంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీనియర్స్ సమావేశానికి వెళ్లొద్దు అని తనకెవరూ చెప్పలేదని, రాష్ట్ర నాయకత్వం మీద తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని జగ్గారెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై అధిష్టానం సీరియస్
ఇది ఇలావుండగా, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సమావేశమైన క్రమంలో ఆ సీనియర్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఫోన్ చేశారు. సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్‌కు చెప్పాలన్నారు. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొదని సూచించారు.
అంతేగాకుండా సమావేశం రద్దు చేసుకోవాలని, సమావేశం ఏర్పాటు చేస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని బోస్ రాజు అన్నారు. ఈ సందర్భంగా బోస్ రాజు మాట్లాడుతూ.. సమన్వయ లోపాలు, సమాచార లోపాలు తప్పితే తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద సమస్యలు ఏమీ లేవని అన్నారు. అవన్నీ క్రమేపీ సర్దుబాటు అవుతాయని, ప్రధాన భేదాభిప్రాయాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ దేశంలోనే నెంబర్ 1 అంటూ బోస్ రాజు
నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఆకాంక్షిస్తున్నారని, పార్టీని నష్టపరిచే ఉద్దేశం ఏ ఒక్క నాయకుడికీ లేదన్నారు. తెలంగాణ నేతలందరితో మాట్లాడుతున్నాను. అంతా పరిష్కారమౌతుందని, ఇప్పటివరకు తెలంగాణ 40 లక్షలు నభ్యత్వం నమోదు కావడం గొప్ప విషయమన్నారు బోస్ రాజు. అంతేగాక, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఉందని, దేశంలో జరుగుతున్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమిష్టి గా పోరాడి, గెలుపు కోసం కృషి చేయాలన్నారు.