షాడో ఎమ్మెల్యేలు కావాలా? మళ్ళీ హాట్‌కామెంట్స్ చేసిన రేగా కాంతారావు.. భద్రాద్రిలో పొలిటికల్ హీట్!!
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒకవైపి, మరోవైపు ప్రతిపక్షాల నాయకులపై మాటల దాడులు ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా మరోమారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

భద్రాద్రి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచిన రేగా సంచలన కామెంట్స్
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 20 సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఉండేది మనమే అంటూ వ్యాఖ్యలు చేసిన రేగా కాంతారావు భద్రాద్రి ప్రజలకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలా లేకా షాడో ఎమ్మెల్యేలు కావాలా తేల్చుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో భద్రాద్రి తమ్ముళ్ళు ఆవేశపడకండి అంటూ పేర్కొన్న రేగా కాంతారావు 2023లో మన గెలుపుతో పర్యాటకులు అడ్రెస్ లేకుండా పోతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

రేగా టార్గెట్ చేసింది పొదెం వీరయ్యనే ... భద్రాదిలో చర్చ
ఇక ఇదే సమయంలో గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమే అంటూ పేర్కొన్నారు. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక రేగా కాంతారావు తాజా వ్యాఖ్యలతో ఆయన భద్రాద్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేకమార్లు భద్రాద్రి జిల్లాలో రేగా కాంతారావు, పొదెం వీరయ్య మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మధ్య సవాళ్ళ పర్వం గతంలోనూ హాట్ టాపిక్ గా మారింది.

కాంతారావు వ్యాఖ్యలపై పొదెం వీరయ్య ఎలా స్పందిస్తారో?
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న తరుణంలో తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతున్న పోరు ఆసక్తికరంగా మారింది. ఇక రేగా కాంతారావు తాజా వ్యాఖ్యలతో పొదెం వీరయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. గతంలోనూ 2023 తర్వాత పొదెం వీరయ్య అడ్రస్ వెతుక్కోవాలి అంటూ రేగా కాంతారావు పొదెం వీరయ్య ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వచ్చే ఎన్నికలలో నియోజకవర్గంలో అడ్రెస్ లేకుండా చేస్తానని రేగా కాంతారావు సవాల్ విసిరారు. ఇక దమ్ముంటే ఓడించు అంటూ పొదెం వీరయ్య రేగా కాంతారావు కు సవాల్ విసిరారు.

రేగా కాంతారావు, పొదెం వీరయ్య మధ్య గతంలోనూ సవాళ్లు
భద్రాద్రి జిల్లాలో ఐదు సీట్లు కాదు కదా నువ్వు కూడా గెలవలేవు అంటూ పొదెం వీరయ్య రేగా కాంతారావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వ్యాఖ్యలపై స్పందించిన రేగా కాంతారావు నా దగ్గర నువ్వు మోకాళ్ల యాత్ర చేసినా నా గెలుపును ఆపలేవు వీరయ్య గారు అంటూ పేర్కొన్నారు. మీ ఓటమి ఖాయమైంది. ఇంకో నియోజకవర్గం చూసుకో.. దాని సంగతి కూడా చూస్తా అంటూ రేగా కాంతారావు పేర్కొన్నారు. మరోమారు మళ్ళీ రేగా వ్యాఖ్యలు వివాదం రేపటంతో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications