"ఆఫర్"ను వాడుకున్న ఎమ్మెల్యే పైలట్ - పక్కా వ్యూహాత్మకంగా..!!
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో సంచలన అంశం బయటకు వస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి- రామచంద్ర భారతి మాట్లాడుకున్న ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి. అందులో మొత్తం డీల్ సెట్ చేసే బాధ్యత రామచంద్ర భారతి ఎమ్మెల్యే పైలట్ కు అప్పగించినట్లు స్పష్టం అవుతోంది. అయితే, పోలీసులు ఈ కేసులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఫోన్ కాల్ మాట్లాడిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇదే కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్నారు. ఆయన ఫిర్యాదు మేరకే పోలీసులు విచారణ ప్రారంభించారు.

పైలట్ కు నందు ఆఫర్
ఈ ఎపిసోడ్ లో కీలకంగా మారిన నందకుమార్‌తో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ముందునే పరిచయం ఉంది. పార్టీ ఫిరాయింపు, ఫలితంగా చేకూరే లాభాల గురించి నందు తనకు వివరించిన సమయంలో దాన్ని తన రాజకీయ భవిష్యత్‌కు ఉపయోగించుకోవాలని రోహిత్ నిర్ణయించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్, మంత్రి పదవి ఇలా అన్ని అంశాల్ని దూరదృష్టితో ఆలోచించిన రోహిత్ తన రాజకీయ భవిష్యత్తుకు నందు తీసుకొచ్చిన ప్రతిపాదనను సద్వినియోగం చేసుకోవాలని భావించినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రోహిత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఈ అంశం ద్వారా సీఎం కేసీఆర్ కు మరింత దగ్గరయ్యే వ్యూహాన్ని పైలట్ రోహిత్ రెడ్డి అమలు చేసారు. సక్సెస్ అయ్యారు.

ఫ్యూచర్ కోసం సద్వినియోగం
తన వద్దకు వచ్చిన ఆఫర్ తో పాటుగా ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని రోహిత్ రెడ్డి నేరగా సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. నందుతో జరిగిన ఫోన్ సంభాషణల సమయంలోనూ పైలట్ తనతో పాటు ముగ్గురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన రోహిత్... వారి పేర్లు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. మధ్యలో సీఎం ఎంత దూకుడుగా ఉంటారో తెలుసుకదా అంటూ చెప్పుకొచ్చారు.
మొయినాబాద్ ఫాం హౌస్ లో వ్యవహారం వెలుగులోకి వచ్చి..పోలీసులు ఎంటర్ అయిన తరువాత ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు సీఎం కేసీఆర్ తమకు అప్పగించిన టాస్క్ పూర్తి చేశామని చెప్పారు.

రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే
ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే రోహిత్ తన రాజకీయ భవిష్యత్ కు అనుకూలంగా మలచుకున్నారని పార్టీలో చర్చ వినిపిస్తోంది. రామచంద్ర భారతి- నందుతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిన సమయంలో విషయం డైవర్ట్ కాకుండా రోహిత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వ్యవహారం గోప్యంగా ఉంచాలని, విషయం సీఎం వరకు వెళ్తే పరిస్థితి మరోలా ఉంటుందని భయంగా మాట్లాడుతూ అవతలి వైపు వారిని పూర్తిగా నమ్మించే ప్రయత్నం చేసారు. తాజాగా రోహిత్ రెడ్డికి సెక్యూరిటీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications