మరో వికెట్: జగన్ పార్టీకి ఎమ్మెల్యే తాటి రాంరాం
ఖమ్మం: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా, ఖమ్మం జిల్లా అశ్వారావు పేట శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన అశ్వారావుపేటలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 3వ తేీదన చంద్రుగొండలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సొంత పార్టీకి చెందిన కొంత మంది నాయకులు తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, అదే సమావేశంలో ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించలేదని, అందుకు నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, అది కూడా తన మనస్తాపానికి కారణమైందని ఆయన అన్నారు. పార్టీని ప్రాణంలా చూసుకున్నా అడుగడుగునా అవమానాలు ఎదుర్కున్నానని ఆయన చెప్పారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరే అవకాశం ఉంది. టిఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన కెసిఆర్ సమక్షంలో ఆయన టిఆర్ఎస్‌లో చేరుతారని అంటున్నారు. ఖమ్మం జిల్లాకే చెందిన గట్టు రామచంద్ర రావు ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. గట్టు రామచంద్ర రావు కూడా టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలహీనంగా ఉంది. దీంతో కెసిఆర్ ఇతర పార్టీల నాయకుల పలసలను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్‌లో చేరడమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications