తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల: కడియం, కౌశిక్ రాజీనామా
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Recommended Video

వాస్తవానికి కడియం, కౌశిక్ రెడ్డి పదవీకాలం 2027 నవంబరు 30 వరకూ ఉంది. కానీ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. కొత్తగా ఎమ్మెల్సీలు ఎన్నికైనా అప్పటి వరకే కొనసాగనున్నారు. నోటిఫికేషన్ వెలువడటంతోనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశముంది. జనవరి 22న నామినేషన్లను ఉపసంహరించుకోడానికి తుది గడువు. జనవరి 29న పోలింగ్ నిర్వహిస్తారు.

షెడ్యూల్ వివరాలు:
జనవరి 11న నోటిఫికేషన్
నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18
నామినేషన్ల పరిశీలన జనవరి 19
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 22
ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ జనవరి 29.
మొత్తం నలుగురు రాజీనామా
తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బీఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్‌కు ఇద్దరు సభ్యులు, బీజేపీకి ఒక సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో శాసనమండలిలో బీఆర్‌ఎస్‌నే అత్యధిక ఎమ్మెల్సీలను కలిగి ఉంది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. దీంతో వీరు శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో బీఆర్‌ఎస్‌కు చెందిన శాసనసభ కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, అలాగే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ జాబితాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. స్థానిక సంస్థల కోటా సభ్యుడైన కసిరెడ్డి నారాయణ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.












Click it and Unblock the Notifications