తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగలనుందా..?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. కొద్దికాలంగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన పార్టీపై కినుకు వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డికి సముచిత స్థానమే దక్కింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తనకు ఎటువంటి సమాచారం లేకుండా తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీ చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచన కూడా చేశారు.

అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి, జీవన్ రెడ్డిని బుజ్జగించింది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పొరపాటు జరిగిందని అంగీకరించారు. తర్వాత పరిస్థితి అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అధిపత్యపోరు నడుస్తోందని తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ఇప్పటి వరకు ముఖాముఖి కలుసుకోలేదు. నియోజకవర్గంలో ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలు కనిపించడం లేదు. నియోజకవర్గానికి చెందిన పనులు కూడా ఎమ్మెల్యే చెప్పినవే జరుగుతున్నాయని జీవన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది.
నామినేటెడ్ పదవులు సైతం వీరి మధ్య దూరం పెంచినట్టు కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ నేతల పేర్లను జీవన్ రెడ్డి సిఫారసు చేశారు. అయితే వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీలోని సీనియర్ నేతల పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీపై కినుకు వహించినట్టు సమాచారం. సీనియర్ నేత అయిన తన పేర్లకు ప్రాధాన్యం ఇస్తుందా ? కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే పేర్లకు ప్రాధాన్యం ఇస్తుందా ? అని వేచిచూస్తున్నారట. ఒకవేళ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications