Dengue: తెలంగాణలో చిన్నారులపై పంజా విసురుతున్న డెంగ్యూ..
రాష్ట్రంలో పిల్లలపై డెంగ్యూ పంజా విసురుతోంది. చాలా మంది చిన్నారులు వైరల్ ఫీవర్, డెంగ్యూ, విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. హైదరాబాద్ లోని పిల్లల దావాఖాన అయిన నిలోఫర్ కు రోజు 25 నుంచి మంది పిల్లలు వైరల్ ఫీవర్ తో వస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహిస్తుండా.. కనీసం 5 నుంచి ఆరుగురు పిల్లలకు డెంగ్యూ అని తేలుతోంది. నిలోఫర్ లో ప్రస్తుతం 30 నుంచి 35 మంది పిల్లలు డెంంగ్యూతో చికిత్స పొందుతున్నారు. ఇటు కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది.
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వార్డు నిండిపోయింది.
పీడియాట్రిక్ వార్డులో 38 బెడ్స్ ఉండగా, ప్రస్తుతం 61 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. బెడ్లు లేక దీంతో నడిచే దారిలో అదనంగా మరో 4 బెడ్స్ వేశారు. ఒక్కో బెడ్ పై ఇద్దరిని ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ల సమాచారం ప్రకారం 106 డెంగ్యూ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. అటు పెద్దపల్లి జిల్లాలో గడిచిన 20 రోజుల్లో 72 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 149 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

డెంగ్యూ బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. అటు ఖమ్మం జిల్లాలో కూడా డెంగ్యూ కేసులు వస్తున్నాయి. పెద్దవారికి కంటే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వారే ఎక్కువ డెంగ్యూ బారిన పడుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో ఆదివారం ఆద్యంత్ అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దొద్దిగూడెంకు చెందిన కుడిమేత జలపతి అనే బాలుడు డెంగ్యూతో మృత్యువాత పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ ఆద్యశ్రీ డెంగ్యూతో మృతి చెందింది.
దోమలతో డెంగ్యూ జ్వరం వస్తుంది. అందుకే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు జ్వరం వస్తే తప్పకుండా రక్త పరీక్షలు చేయించాలని కోరుతున్నారు. ప్లేట్ లేట్స్ పడిపోతున్నట్లు తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాలని చెబుతునన్నారు. అయితే చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్లెట్ సెపరేటర్ మషిన్లు అందుబాటులో లేవు. దీంతో బాధితులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications