బిడ్డల ప్రాణాలు తీస్తున్న కన్నతల్లులు.. ఎక్కడికి పోతోంది అమ్మతనం!
సృష్టికి మూలం అమ్మ. అటువంటి అమ్మ తన బిడ్డలను కడుపున పెట్టుకుని చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు చిన్న కష్టం వచ్చిన ఆ తల్లి గుండె విలవిలలాడుతుంది. అటువంటి అమ్మతనం ఇప్పుడు ఏమైపోతుంది? బిడ్డల పట్ల తల్లికి ఉండే మమకారం ఎటు పోతుంది? అన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
బిడ్డల ప్రాణాలు తీస్తున్న తల్లులు
తన ప్రాణం పోయినా బిడ్డల జీవితం బాగుండాలని కోరుకునే అమ్మ బిడ్డల ప్రాణాలు ఎందుకు తీస్తుంది? పేగు తెంచుకు పుట్టిన బంధాన్ని ఎందుకు కాదనుకుంటుంది? వంటి ప్రశ్నలు ప్రస్తుతం రోజు జరుగుతున్న సంఘటనలను బట్టి పదేపదే ఉత్పన్నమవుతున్నాయి. తల్లులు కర్కశంగా బిడ్డల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇప్పుడు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

పిల్లలను నరికి చంపి, తల్లి ఆత్మహత్య
మొన్నటికి మొన్న ఓ అమ్మ ఇద్దరు చిన్నారులకు మరణ శాసనం రాసింది. పిల్లలకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేని కన్నతల్లి ఇద్దరు కుమారులను వేట కొడవలితో అత్యంత దారుణంగా నరికి చంపింది. హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఇద్దరు చిన్నారులను చంపి, తను ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
గాజుల రామారం ఘటన మరచిపోక ముందే ప్రగతినగర్ లో దారుణం
పిల్లలకు శ్వాసకోశ సమస్యలు, తనకు కంటి సమస్య ఉండడంతో, భర్త పట్టించుకోవడంలేదని నిరాశలో ఆ తల్లి మానసిక వేదనకు గురై ఇద్దరు చిన్నారులను అత్యంత కర్కశంగా హతమార్చి తను ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా మేడ్చల్ బాచుపల్లి పీఎస్ పరిధిలో ప్రగతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కన్న కూతురికి విషమిచ్చి కూతురు ప్రాణాలు తీసిన తల్లి, తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
బిడ్డకు విషమిచ్చి చంపి , తానూ విషం తాగిన తల్లి
32 ఏళ్ళ కృష్ణ పావని కన్న బిడ్డకు విషమిచ్చి చంపి, తను కూడా విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కూకట్పల్లి ప్రసాద్ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి తల్లి కుమార్తెను చంపి తను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మతనానికి మాయని మచ్చగా తొందరపాటు నిర్ణయాలు
కష్టాలు ఎన్ని వచ్చినా, సమస్యలు ఏవైనా సరే ధైర్యంగా బిడ్డల కోసం ఎదుర్కోవలసిన తల్లులు, ఆ బిడ్డల ఉసురు తీసి, తాము కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో తల్లులు తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు అమ్మతనానికి మాయని మచ్చగా మారుతున్నాయి. ఇకనైనా తల్లులు కష్టాలు వచ్చినప్పుడు తాము ధైర్యంగా బతుకుతూ బిడ్డలకు బతుకుబాట చూపాలి కానీ, ఇటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడకూడదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications