కేటీఆర్ గడ్డం పెంచటం వెనుక అసలు కారణం చెప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్!
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డం పెంచుకోవడం ఆసక్తికర చర్చకు కారణం అయ్యింది. ఇటీవల రామగుండంలో జరిగిన సింగరేణి సభలో కేటీఆర్ కొత్త గడ్డం లుక్‌తో కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై పలు పార్టీల నేతలు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేడు నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, "గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్ కొత్తగా గడ్డం పెంచుతున్నారేమో" అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. గడ్డం పెరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి పదవి మాత్రం దక్కదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ పాత సచివాలయానికి వెళ్తే ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరో చెప్పడంతో కొత్త సచివాలయం నిర్మించారని, అయినా ఎన్నికల్లో గెలవలేకపోయారని చెప్పారు.

అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో గడ్డం పెంచారని, గడ్డం పెరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ పెరగలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆయన అన్నారు.ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంపై అసంతృప్తిగా ఉందని, బీఆర్ఎస్‌తో పొత్తు ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని చెప్పారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా గెలుస్తుందని, తెలంగాణలో కాషాయ సునామీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్ మార్పుల వెనుక అవినీతి జరిగిందని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారీగా నిధులు దుర్వినియోగం చేశారని, ప్రజలు మళ్లీ ఆ పార్టీకి ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెయిడ్ ప్రచారం నిర్వహిస్తోందని కూడా ఆరోపించారు. రైతుల సమస్యలపై మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
క్రాప్ హాలిడే గురించి నిర్ణయం తీసుకునే ముందు రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.50 వేల ధర లభించేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే బాండ్ పేపర్ రాసి ఇస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యంపై కూడా ఆందోళన చేపడతామని చెప్పారు.కేటీఆర్ గడ్డం పెంపు విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ధర్మపురి అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.













Click it and Unblock the Notifications
