రేవంత్‌పై కవిత: కేసీఆర్ కుట్ర! ఎర్రబెల్లి లీక్ చేశారేమో!!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు పైన పలువురు తెరాస నేతలు వేర్వేరుగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
తెలంగాణలో టీడీపీని వెంనటే మూసివేయాలన్నారు. సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్ని తెలంగాణ నాయకులకు కత్తులు ఇచ్చి వారే పొడుచుకునేలా చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.
ప్రత్యేక తెలంగాణ విషయంలో వారి కుట్రలు ఫలించకపోవడంతో ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలను ఉసిగొల్పుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు వెనుక తెరాస కుట్ర లేదన్నారు. ఇలాంటి నీచమైన కుట్రలు చేసే అవసరం తమ పార్టీకి లేదన్నారు.

బాబు ప్రమేయంతోనే: పల్లా
చంద్రబాబు ప్రమేయంతోనే ఇది జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలన్నారు. రేవంత్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి వెనుక ఉన్న వారిని అరెస్టు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమకు చంద్రబాబు పైన అనుమానాలున్నాయన్నారు. టీడీపీలో ఆధిపత్య పోరు ఉందని, ఆ కారణంగా రేవంత్ రెడ్డి గురించి టీడీపీ మరో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావే సమాచారం ఇచ్చారేమోనని కౌంటర్ ఇచ్చారు. ఇది కేసీఆర్ కుట్ర అని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్ రమణ తదితరులు అన్నారు.
వీడియోలు బయటకు ఎలా వచ్చాయి: విద్యాసాగర్
చంద్రబాబు పైన కేసులు పెట్టాలంటే కేసీఆర్ పైన వంద కేసులు పెట్టవలసి వస్తుందని టీడీపీ సీనియర్ నేత విద్యాసాగర్ అన్నారు. టీడీపీ నీతి, నియమాలకు కట్టుబడిన పార్టీ అన్నారు. ఒక్క వీడియో విడుదల కాలేదని అధికారులు చెబుతుంటే, ఈ వీడియోలు బయటకు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications