కెసిఆర్‌పై కూతురు కవిత అసంతృప్తి: కొండా సురేఖకు చోటు దక్కేనా?
హైదరాబాద్: రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగినా, ఓ మహిళకు తప్పక చోటు లభిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సిఎం కెసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
కెసిఆర్ కేబినెట్లో మహిళలు లేకపోవడం బాధాకరమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిలో తాను కూడా ఉంటానని చెప్పారు. పార్క్ హయత్ హోటల్లో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో భవిష్యత్తు భారతంలో మహిళల ముందంజ అనే అంశంపై జరిగిన భేటీకి కవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్లో మహిళలకు చోటు దక్కని విషయమై ఫిక్కీ సభ్యురాలు ఒకరు ప్రశ్నించారు. దీనిపై కవిత మాట్లాడుతూ.. ఇది శోచనీయమన్నారు. అందుకు తగ్గ కారణాలు కూడా ఆమె వివరించే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉండగా.. మహిళలకు కేబినెట్లో చోటు లేకపోవడంపై విపక్షాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుముందు జరగనున్న పునర్ వ్యవస్థీకరణలో మహిళలకు చోటు దక్కవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, కవిత వ్యాఖ్యలు.. త్వరలో ఉంటుందని భావిస్తున్న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఓ మహిళకు తప్పక చోటు లభిస్తుందనేందుకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీత రెడ్డి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. కోవా లక్ష్మీ పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులైనప్పటికీ.. ఆ నియామకాలను కోర్టు వెనక్కి తీసుకోవాలని సూచించింది. మిగిలినవారు కొండా సురేఖ, రేఖా నాయక్, బొడిగే శోభలు ఉన్నారు.












Click it and Unblock the Notifications