తెలంగాణలో ముందస్తు ఎన్నికలు : మొన్న రేవంత్ - నేడు ఉత్తమ్ : లెక్క పక్కా అంటూ..!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా. 2018లో తరహాలోనే కేసీఆర్ ఈ సారి ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారా. కాంగ్రెస్ నేతల అంచనా ఏంటి. మొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే అంశం పైన స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని విపక్ష నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. తాజాగా రేవంత్ ఈ ఏడాది డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయంటూ రేవంత్ పేర్కొన్నారు.

ముందస్తు పక్కా అంటున్న కాంగ్రెస్
ఇప్పుడు పీసీసీ మాజీ చీఫ్ మరో అడుగు ముందుకు వేసారు. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి... నియోజక వర్గాలకు వెళ్ళండని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసే అంశం పైన కీలక వ్యాఖ్య చేసారు. తాను అసెంబ్లీ బరిలో ఉండే అంశం పైన సోనియా నిర్ణయం తీసుకుంటారని .. ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి సిద్దమని స్పష్టం చేసారు. అయితే, కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో ముందస్తుకు అవకాశం లేదని తేల్చి చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగులు
అదే విధంగా బీజేపీ నేతలు సైతం వచ్చే ఎన్నికలకలో తమదే గెలుపు అంటూ ధీమాగా చెబుతున్నారు. ఇక, జాతీయ రాజకీయాల పైన ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తరువాత తన భవిష్యత్ కార్యాచరణ పైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా జార్ఖండ్ లో జేఎంఎం నేత.. సీఎం హేమంత్ సోరెన్ ను కలిసిన కేసీఆర్ ఇప్పటి వరకు ఎటువంటి ఫ్రంట్ లేదని స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతానని వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ రహిత ఫ్రంట్ అంటూ ఒక వాదన.. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదనే వాదనతో ఇప్పటి వరకు స్పష్టత రాలేదని తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికలతో పాటుగా
అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో..కేసీఆర్ జాతీయ రాజకీయాల పైన ఫోకస్ చేస్తే..ఖచ్చితంగా తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ లో మాత్రం ఇంటిపోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోజు జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ జగ్గారెడ్డి బాయ్ కాట్ చేసి బయటకు వచ్చారు. ఇక, ముందస్తు ఎన్నికలంటూ కేడర్ లో జోష్ పెంచే ప్రయత్నాల కోసం చెబుతున్నారా.. లేక, స్పష్టమైన సమాచారంతోనే కేడర్ ను సిద్దం చేస్తున్నారా అనే చర్చ కూడా కాంగ్రెస్ లో వినిపిస్తోంది. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం తన పాలన..ప్రజాభిప్రాయం పైన నిరంతరం సర్వేలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు సైతం అధికార - ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో హటెక్కే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications