కుగ్రామం నుండి అమెరికా దాకా.. ములకనూరు బ్రాండ్ బియ్యం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
సమిష్టిగా కష్టపడితే సత్ఫలితాలు వస్తాయి అని చెప్పటానికి ములకనూరు సహకార సొసైటీ ఒక ఉదాహరణ. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార సొసైటీ ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకుంది. ములకనూరు సహకార సొసైటీ బియ్యం ఇప్పుడు అమెరికా వరకు చేరనుంది. తెలంగాణ సోనా, జైశ్రీరామ్ రకాల బియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
15 ఏళ్లుగా బ్రాండింగ్ చేసి అమ్ముతున్న ఈ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల ద్వారా ఏటా రూ.25 కోట్ల విలువైన బియ్యం విక్రయిస్తోంది. స్థానికంగా జైశ్రీరామ్ కిలో రూ.80, తెలంగాణ సోనా రూ.70కి అమ్ముతుండగా, అమెరికాలో కిలోకు రూ.200 వరకు ధర పలికే అవకాశం ఉంది. క్రిమిసంహారక మందులు వాడని నాణ్యమైన బియ్యం కావడంతో ప్రవాస తెలుగువారు ములకనూరు సహకార సొసైటీ బియ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు.

సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలో అమెరికా సంస్థ హార్వెస్ట్ లింక్‌తో ఒప్పందం కుదిరింది. విశాఖపట్నం పోర్టు ద్వారా మొదటి విడతగా 25 టన్నులు పంపాలని నిర్ణయించారు. కంటైనర్ అనుమతి రాగానే రెండు నెలల్లో ఎగుమతి మొదలవుతుంది. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముల్కనూర్ బియ్యం ఇప్పటికే రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి పేరు సంపాదించింది. ప్రవాసుల డిమాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం రైతులకు, సహకార రంగానికి కొత్త ఆశలు కలిగిస్తోంది. నాణ్యత, బ్రాండింగ్, ఎగుమతి అనుమతులు కలిసి వస్తే తెలంగాణ బియ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది.
కాగా ములకనూరు సహకార సొసైటీ 1956లో దివంగత అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి నేతృత్వంలో కేవలం 373 మంది సభ్యులు, రూ.2,300 వాటాధనంతో ప్రారంభమైంది. మొదటి 14 ఏళ్లు ఆయన ఇంటి నుంచే నడిచింది. నేడు 14 గ్రామాల్లో 7,000కు పైగా సభ్యులు, 150 మంది సిబ్బందితో నడుస్తోంది. ఏటా రూ.400 కోట్లకు పైగా వ్యాపారం చేస్తూ, దాదాపు సున్నా ఎన్‌పిఏలతో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది. రైతులకు పంట రుణాలు, విత్తనాలు, నిల్వ సౌకర్యాలు, బోనస్, వృద్ధాప్య పింఛన్ వంటి సేవలు అందిస్తోంది.













Click it and Unblock the Notifications
