రాములమ్మకు ఏమైంది- పార్టీకి దూరంగా: అడ్డుపడుతోందెవరు..!!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోన్నాయి. నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే అక్కడి వాతావరణం వేడెక్కింది. హాట్ కేక్‌గా మారిందీ సీటు. అన్ని పార్టీల నజర్ కూడా మునుగోడు మీదే ఉంది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైన ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ప్రతిష్ఠాత్మకంగా మునుగోడు..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తోన్నాయి ప్రధాన పార్టీలన్నీ. ఇందులో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకునే పనిలో పడ్డాయి. తన స్థానాన్ని తాను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికీ వెళ్లనున్నారు. ప్రతి గ్రామాన్నీ పలకరించనున్నారు.

అక్కడ పోగొట్టుకున్న పరువు కోసం టీఆర్ఎస్
ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ హోరాహోరిగా పోరు సాగించనున్నాయి. నాగార్జున సాగర్ మినహాయిస్తే- ఇదివరకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోయిన ప్రతిష్ఠను తిరిగిపొందడానికి మునుగోడు ఉప ఎన్నిక సరైన వేదికగా భావిస్తోంది. అధికారంలో ఉండీ మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడం తలవంపు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. ఇందులో భాగంగా మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది.

బహిరంగ సభతో బీజేపీ..
ఈ నెల 21వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా బీజేపీ మునుగోడులోనే సభను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అంతకంటే ఒక్కరోజు ముందే తన సత్తాను నిరూపించుకునేలా బహిరంగ సభ కోసం సమాయాత్తమౌతోంది టీఆర్ఎస్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లల్లో తెలంగాణ బీజేపీ నాయకులు తలమునకలై ఉన్నారు. తీరిక లేకుండా గడుపుతోన్నారు.

స్టార్ క్యాంపెయినర్..
ఈ పరిణామాల మధ్య బీజేపీలో అసమ్మతి తలెత్తినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకూ క్రియాశీలకంగా వ్యవహరించిన విజయశాంతి అలకపూనినట్లు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, అక్కడ నిర్వహించ దలచిన భారీ బహిరంగ సభ కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతి ఎక్కడా కనిపించట్లేదు.. ఆమె పేరూ వినిపించట్లేదు. మునుగోడు ఉప ఎన్నికకు విజయశాంతి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతారని అందరూ భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది.

జయసుధ కోసం ప్రయత్నాలతో..
విజయశాంతికి ధీటుగా పార్టీలోకి మాజీ శాసన సభ్యురాలు, సినీ పరిశ్రమకే చెందిన జయసుధను తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. దీనివల్లే విజయశాంతి పార్టీకి దూరం అయ్యారా? అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. మునుగోడు ఉప ఎన్నిక కోసం సమాయాత్తమౌతోన్న వేళ.. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న విజయశాంతి సేవలను పార్టీ ఎందుకు ఉపయోగించుకోవట్లేదనేది చర్చనీయాంశమైంది.

క్లారిటీ వాళ్ల దగ్గరే..
దీనిపై విజయశాంతి స్పందించారు. తాను అసంతృప్తిగా ఉన్నానో లేదో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని తమ పార్టీ నాయకులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తాను అసంతృప్తిగా ఉన్నానా? లేదా? అనే విషయానికి వారే క్లారిటీ ఇస్తారని స్పష్టం చేశారు. తాను మౌనంగా ఉన్నాననే విషయాన్ని విజయశాంతి పరోక్షంగా అంగీకరించారు కూడా. తనను ఎందుకు మాట్లాడనివ్వట్లేదనేది తెలియదని పేర్కొన్నారు.

సేవలు అందిస్తా..
పార్టీ తన సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే అందుకు సిద్ధమని విజయశాంతి మరోసారి స్పష్టం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సైతం తాను వెనుకాడబోనని తేల్చి చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి ఎన్నికల బరిలో దిగుతానని, దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మాత్రం పార్టీ నాయకత్వమేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications