కూర అడిగితే లేదని అన్నందుకు అంత పని చేస్తారా..???
క్షణికావేశం కారణంగా మనుషులు చిన్న చిన్న మాటలకే ఆగ్రహం ఆపుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే కొన్నిసార్లు దారుణాలకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుని అందరినీ కలచివేసింది. నా దగ్గర కూర లేదు అని చెప్పిన కారణంగానే తోటి కార్మికుడు మరో కార్మికురాలిపై గొడ్డలితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలోని కిటికీలు తయారు చేసే కంపెనీలో ఈ దారుణం జరిగింది. అక్కడ కూలీగా పని చేస్తున్న బానోత్ రుక్మిణి (35) తన భోజనం చేస్తుండగా, తోటి కార్మికుడు రవి (38) ఆమె వద్దకు వచ్చి కూర అడిగాడు. రుక్మిణి వద్ద ఆ సమయంలో కూర లేకపోవడంతో, ''నా దగ్గర కూర లేదు'' అని చెప్పింది. అయితే ఆ చిన్నపాటి సమాధానం రవికి నచ్చలేదు. క్షణాల్లోనే కోపంతో రగిలిపోయి పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకొని రుక్మిణిపై విరుచుకుపడ్డాడు.

విచక్షణా రహితంగా గొడ్డలితో దాడి
రవి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై రుక్మిణి తల, మెడపై గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. క్షణాల్లోనే ఆమె రక్తపు మడుగులో కూరుకుపోయింది. కానీ ధైర్యం కోల్పోకుండా రుక్మిణి గట్టిగా అరిచి సహాయం కోరింది. దీంతో భయపడి రవి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన రుక్మిణి రక్తస్రావం అవుతున్నా సహాయం కోసం బయటికెళ్లింది. స్థానికులు ఈ దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రవి కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. ఇది కేవలం క్షణికావేశంలో జరిగినదా? లేక వీరిద్దరి మధ్య పూర్వ ద్వేషం లేదా ఇతర వ్యక్తిగత విభేదాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశం ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందో మళ్లీ ఒకసారి ఈ ఘటనతో నిరూపితమైందని అంటున్నారు.












Click it and Unblock the Notifications