రేవంత్ సర్కారుకు హైకోర్టులో భారీ ఊరట
హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువులకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ను నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా, బుధవారం విచారణకు హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్ ఇప్పటివరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లుగా తెలిపారు.

530 చెరువులకు సంబంధించి తుది నోటిఫికేషన్లు పూర్తయినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీకి 3 నెలల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరగా.. అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
రేవంత్ సర్కారు భారీ ఊరట
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణకు మార్గం సుగమమైంది. హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ సర్కారుకు భారీ ఊరట లభించినట్లయింది. మూసీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు తాజాగా, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అక్రమ నిర్మాణాలను తొలగించడం సహా కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది.
మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్దంగా, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది.
అంతేగాక, మూసీ బఫర్‌జోన్, ఎఫ్టీఎస్, రివర్‌బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలి. మూసీ రివర్‌బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలి. 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్టప్రకారం తొలగించాలని హైకోర్టు తెలంగాణ సర్కారుకు తేల్చింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల సర్వేకు అందరూ సహకరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications