చెరువులోనే నాగార్జున N కన్వెన్షన్... హైడ్రా ఏం చెయ్యబోతుంది?
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా, వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇక ఇదే సమయంలో గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఇక ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువగా మారాయి.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదు
అక్కినేని నాగార్జున తమ్మిడికుంట చెరువులో మూడు ఎకరాల 30గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదుచేసింది. తమ్మిడికుంట చెరువును పూర్తిస్థాయిలో కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని మొదటినుంచి దీనిపైన వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.

గతంలో కేసీఆర్ హయాంలో ఏం జరిగిందంటే
తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా దీనిని కూల్చివేస్తారని భావిస్తే ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడిదాకా వెళ్ళిన బుల్డోజర్లు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోలేదు. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్,ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఇప్పుడు ఎంతటి వారైనా వెనక్కు తగ్గకుండా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను తొలగించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
హైడ్రా రంగంలోకి దిగుతుందా?
తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించాలని కోరుతున్నారు.ఇప్పుడు చెరువుల కబ్జాల పైన గురిపెట్టి ప్రత్యేకంగా హైడ్రా అనే వ్యవస్థను తీసుకురావడంతో తమ్మిడి కుంట చెరువులో ఉన్న నిర్మాణం పైన ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా వెళ్లడంతో దీనిపైన ఇప్పుడైనా హైడ్రా రంగంలోకి దిగుతుందా? లేక సినీ సెలబ్రిటీ అని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఆక్రమణల విషయంలో చాలా సీరియస్ గా ఉన్న రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై వెయ్యబోయే స్టెప్ ఎలా ఉంటుంది అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications