పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును వెంటనే ఆపండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ
నాగార్జునసాగర్ జలాశయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ లేఖ రాశారు.ఏపీ ప్రభుత్వం విజయపురి సౌత్ వద్ద రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది.
పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా చెబుతున్నారు. అయితే ఇన్‌టేక్ వెల్‌ను జలాశయం డెడ్ స్టోరేజ్ స్థాయి (155.48 మీటర్లు) కంటే దిగువన 150.45 మీటర్ల వద్ద నిర్మించాలని ప్రతిపాదించడం తెలంగాణకు ఆందోళన కలిగిస్తోంది. ఇలా చేస్తే రిజర్వాయర్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, జలాశయ నిర్వహణ, నీటి నియంత్రణపైనా ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటికే నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ ఏటా 2.84 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకుంటోంది. అదనంగా నీరు తరలించాలంటే కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని తెలంగాణ స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం విభజన చట్టం, నదీ జలాల పంపిణీ నిబంధనల ఉల్లంఘన అని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ఇన్‌టేక్ వెల్స్, శుద్ధి కేంద్రాలు, పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, ఇప్పటికే కొంత మొత్తం ఖర్చు చేశారని లేఖలో పేర్కొన్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై స్పష్టంగా మాట్లాడారు. తెలంగాణకు కేటాయించిన నదీ జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం అని ఆయన అన్నారు. నీటి హక్కులను కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు.
ఇలాంటి సమయంలో అనుమతులు లేకుండా నీటిని తరలించే ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖ స్థాయిలో ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలని కోరుతోంది. ప్రాజెక్టు వివరాలను సమగ్రంగా పరిశీలించి, అనుమతులు లేకుండా పనులు కొనసాగకుండా చూడాలని డిమాండ్ చేస్తోంది.














Click it and Unblock the Notifications
