పీకేని ఏకిపారేసిన తెలంగాణా కాంగ్రెస్ నేతలకు కొత్తచిక్కు; అందరిలోనూ అదే ఆందోళన!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయా? టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ ను నిన్నమొన్నటిదాకా తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారా? కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతుంటే ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్త సమస్య
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటినుండి పార్టీ ప్రజాక్షేత్రంలో ముందుకు దూసుకు వెళుతోంది అని భావిస్తే పార్టీలో అంతర్గత కలహాలు రెండడుగులు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి లాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆగ్రహానికి కారణమైంది. టిఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పీకేపై విరుచుకుపడిన టీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏకే 47 లాంటి కార్యకర్తలు ఉన్నారని,40 లక్షల మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి మాత్రమే కాదు జగ్గారెడ్డి తదితర కీలక నేతలు కూడా గాంధీభవన్ వేదికగా ప్రశాంత్ కిషోర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవటానికి రెడీ అయిన ప్రశాంత్ కిషోర్
ఇక ఈ ఎపిసోడ్ అలా ఉంచితే తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయాడు. దేశంలోనే పొలిటికల్ స్త్రాటజిస్ట్ గా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ప్రశాంత్ కిషోర్ విషయంలో ఆలోచనలో పడింది. దేశంలో వరుసగా పరాజయాలను చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ట్రాక్ లో పెట్టి 2024 ఎన్నికల టార్గెట్ గా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని, తన ఆలోచనలను అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టటం సాధ్యమవుతుందని పీకే సూచిస్తున్నారు.

నాలుగురోజుల్లో మూడు సార్లు సోనియాతో భేటీ... టీ కాంగ్రెస్ లో టెన్షన్
అందుకోసం గత నాలుగు రోజుల్లో మూడు సార్లు సోనియాగాంధీతో భేటీ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి, పార్టీని విజయపథంలో నడిపించడానికి సుముఖంగా ఉన్నారు. ఇక దీనిపై సోనియా గాంధీ పార్టీ ముఖ్యనేతలతో తర్జనభర్జనలు జరుపుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది.

తెలంగాణాలో టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న పీకే .. కాంగ్రెస్ లో చేరితే ఎలా?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా భావించి కాంగ్రెస్ పార్టీ నేతలు కెసిఆర్ ను, టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు.

తెలంగాణా కాంగ్రెస్ పీకే ఎపిసోడ్ తలనొప్పిగా
జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం లేకపోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర నాయకులకు మాత్రం ఈ ఎపిసోడ్ పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న దానిపై అందరిలో టెన్షన్ పట్టుకుంది. కేంద్రంలో ఉన్న బిజెపి ని ఢీ కొట్టాలంటే ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలని ప్రశాంత్ కిషోర్ అధిష్ఠానానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతాయో అన్నది అర్ధం కాకుండా ఉంది.

పీకే విషయంలో క్లారిటీ కోసం తెలంగాణా కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు
ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరితే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ విషయంలో క్లారిటీ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో రాహుల్ గాంధీ టూర్ తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పష్టమైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ నేతలకు అటు ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించేలా చూడాలని భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications