తెలంగాణలో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు: ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. పైకి వెళ్లేకొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం రెండు రోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ క్రమంలోనే తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారంనాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆది, సోమవారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications