ఆ కండక్టర్ మహిళలకు ఉద్దేశపూర్వకంగా టికెట్ జారీ చేయలేదు: అసలేం జరిగిందంటే?
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎక్కడైకైనా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలవుతోంది.
అయితే, ఆదివారం రోజున ఓ కండాక్టర్ మహిళకు టికెట్ తీసుకున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ మహిళకు టికెట్ కొట్టాడు కండక్టర్. ఈ క్రమంలో ఆ కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనపై విచారణ జరిపారు. అయితే, అసలు విషయం తాజాగా వెలుగు చూడటం గమనార్హం. ఆ కండక్టర్ ఉద్దేశపూర్వకంగా టికెట్ జారీ చేయలేదని తేలింది.

నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ విచారణకు ఆదేశించారు. ఎండీ ఆదేశాలతో.. సంబంధిత కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ జరిపారు.
నిజామాబాద్-బోధన్ రూట్ పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పురుష ప్రయాణికుడు ముగ్గురికి బోధన్ కు టికెట్ ఇవ్వమని కండక్టర్‌ను అడిగారు. రూ.30 చొప్పున ముగ్గురికి రూ.90 టికెట్‌ను కండక్టర్ జారీ చేశారు.
నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత పురుష ప్రయాణికుడు కండక్టర్ వద్దకు వచ్చి.. మహిళలకు ఉచితం కదా.. టికెట్ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ముగ్గురు పురుషులే అనుకుని టికెట్‌ను జారీ చేశారని, అన్యత భావించవద్దని కండక్టర్ సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ టికెట్‌ను వెనక్కి తీసుకుని పూర్తి డబ్బును తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ విచారణలో కండక్టర్ ఉద్దేశపూర్వకంగా టికెట్ జారీ చేయలేదని తేలింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రశాంతంగా అమలవుతోంది. ఈ సౌకర్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.ఈ పథకం సజావుగా అమలు అయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని సంస్థ కోరుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications