ఎన్నికల కోడ్ సమయంలో నో పోలీస్ సెల్యూట్.. నో ప్రోటోకాల్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల యుద్ధానికి అన్ని రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల మూడవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, మూడవ తేదీ నుండి పదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 30 వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారికి లభించే కొన్ని గౌరవాలు నిలిచిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మంత్రుల పర్యటనలకు, ఎమ్మెల్యేల పర్యటనలకు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉండదు.

ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన రోజు నుండి మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ముగిసేవరకు ప్రస్తుతం 51 రోజులపాటు రాజ్యాంగబద్ధంగా వారికి లభించే గౌరవం పోలీసుల సెల్యూట్ మరియు ప్రోటోకాల్ వారికి లభించదు. తిరిగి వారు రాజ్యాంగబద్ధమైన ఓటర్లచే పోలింగ్ నాడు వారు వేసిన ఓటు హక్కుతో గెలిచి, ఎమ్మెల్యేగా బాధ్యత చేపట్టిన తర్వాత వారికి రావలసిన రాజ్యాంగ గౌరవం, ప్రోటోకాల్ తిరిగి వస్తాయి.
అప్పటివరకు పోలీసులకు నో సెల్యూట్.. నో ప్రోటోకాల్ అని చెబుతోంది ఎలక్షన్ కోడ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటంతో ప్రజా ప్రతినిధులు అందరూ ప్రోటోకాల్ కు, పోలీస్ సెల్యూట్ కు దూరమయ్యారు. అయితే వీరికి సంబంధించిన భద్రత విషయంలో మాత్రం ఇంటెలిజెన్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైన అంశాల మీద ఆధారపడి వారికి కేటాయించిన సెక్యూరిటీ కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే కాదు ముఖ్యమంత్రి కి కూడా ఎలక్షన్ కోడ్ నిబంధనలు వర్తిస్తాయి. ఎన్నికలు ముగిసే దాకా ఆయన కూడా అధికారిక వాహనాలలో పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఆయనకు కూడా ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా, బహిరంగ సభలకు వెళ్ళినా ప్రోటోకాల్ వర్తించదు.












Click it and Unblock the Notifications