దళితబంధు పొందితే.. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కట్!
హైదరాబాద్: దళితబంధు పథకం అమలులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో దళితబంధు కింద లబ్ధి పొందిన కుటుంబాలను ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని ఇతర పథకాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక మార్పులు చేస్తోంది.

దళితబంధు లబ్ధిదారులకు రూ. 10 లక్షలు
లబ్ధిదారుడి ఆధార్, రేషన్ కార్డు సహాయంతో సాప్ట్‌వేర్ ద్వారా వడపోత ప్రక్రియ పూర్తిచేస్తోంది. దళితబంధు పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ. 10 లక్షల విలువైన యూనిట్ ను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి ద్వారా ఉపాది పొంది ఆర్థిక సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దళితబంధుకు ఎంపికైతే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కట్
అయితే, సాధారణంగా ఎస్సీ కార్పొరేషన్ కింద రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక పథకాల కింద ఒకసారి లబ్ధిపొందిన కుటుంబాలకు ఐదేళ్లపాటు తదుపరి ఎంపికలో అవకాశమివ్వరు. అదే విధంగా దళితబంధు పథకం కింద ఒకసారి లబ్ధి పొందిన వారికి.. ఇక ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక సహాకర పథకాల కింద ఎంపిక చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దళితబంధు ఎలా అమలు?
కాగా, దళితబంధు పథకం కింద ఇప్పటి వరకు 38,476 యూనిట్లు మంజూరు కాగా, వీటిలో 90 శాతం యూనిట్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అందజేసింది. ఇప్పటి వరకు 3,300 కోట్లకుపై ఈ పథకం కింద మంజూరైంది. లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం ఎమ్మెల్యేల సిఫారసు మేరకు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో.. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి నియోజకవర్గాలవారీగా లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోవడంతో దళితబంధుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ఎస్సీ కార్పొరేషన్ కసరత్తులు చేస్తోంది.












Click it and Unblock the Notifications