రావుగారూ! మీ పోలీసు వ్యవస్థ బాగుందన్నారు: కెసిఆర్
హైదరాబాద్: శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలంటే పోలీసులకు, ప్రజలకు మధ్య సఖ్యత ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో పోలీసు ట్విన్ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో పోలీసుల భాష గతంలోలాగా లేదని చాలా మారిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని తనతో చాలా మంది అన్నారని చెప్పారు. పోలీసులు ఎంతో హుందాగా, మర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసు వ్యవస్థ బలోపేతం కానుందన్నారు.

పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కంట్రోల్ వ్యవస్థను విపత్తు సమయంలో పోలీసులే కాక అందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినపుడు కూడా ఈ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చని సూచించారు.
రెండు కంట్రోల్ టవర్లలో మొదటి టవర్‌లో 24 అంతస్థులు, రెండో అంతస్థులో 17 అంతస్థులు ఉంటాయని వివరించారు. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. మన దగ్గర మంచి పోలీసు ఆఫీసర్లు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. క్రైం కంట్రోల్‌లో ప్రజల సహకారం కూడా అవసరమన్నారు.

తప్పులన్నీ పోలీసులవే అన్నట్టుగా వ్యవహరించరాదని చెప్పారు. గతంలో పోలీసు డీజీపీలు కూడా చాలా సమర్థవంతంగా శాంతిభద్రతలను పరిరక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు కూడా మారారని వివరించారు.
పోలీసులు ఆధునిక టెక్నాలజీ వచ్చినపుడు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ఇతర నేతలు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సింగపూర్, న్యూయార్కు తర్వాత హైదరాబాద్‌లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతోందని కెసిఆర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్లనే ఆ దేశాల్లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నాయని, నేరాలు తక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థను ఏవరైనా సరే విపత్తు కాలంలో వినియోగించుకోవచ్చని తెలిపారు.
మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైనదని, జాతీయస్థాయిలో మంచి పేరుందని కొనియాడారు. తాను జాతీయస్థాయి నేతలను కలిసినపుడు రావుగారు మీ పోలీసు వ్యవస్థ చాలా గట్టిదని పొగిడారని తెలిపారు.
పోలీసులు ముపటిలా మామూళ్లు అడగటంలేదని తనతో చాలా మంది అన్నారని వివరించారు. ప్రభుత్వమే పోలీసు స్టేషన్లకు నెలానెలా అయ్యే ఖర్చులను మంజూరు చేస్తుందని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు పొల్యూషన్‌లో పనిచేస్తున్నారని అందుకే వారి కోసం వేతనంలో 30 శాతం అధికంగా చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వం కట్టించే ఇండ్లలో ప్రతీ యేటా పోలీసులకు పది శాతం ఇండ్లను కేటాయిస్తామన్నారు. పోలీసులు అవినీతిరహితంగా, ఉత్సాహంగా పనిచేయాలని, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు.
పోలీసు వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యతనిస్తాం: నాయిని
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ వ్యవస్థను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అనుసంధానం చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇందు కోసం వారికి పోలీసు నియామకాల్లో 33 శాతం కోటా ఇస్తామన్నారు. నిఘా కోసం హైదరాబాద్ మహానగరం అంతా విడతలవారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications