ఒడిశాలో ఎస్కేప్: హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్, పెద్ద స్కెచ్చే!
హైదరాబాద్: కరుడుగట్టిన నేరస్తుడు, ఒడిశా గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్‌ను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి తప్పించుకుని గత వారం రోజులుగా తిరుగుతున్న అతడ్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్య కేసుతోపాటు కిడ్నాప్ కేసులోనూ హైదర్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.

ఒడిశా నుంచి పరారైన గ్యాంగ్‌స్టర్
వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న హైదర్‌ను ఒడిశా పోలీసులు కటక్ లోని ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే, అక్కడ్నుంచి పరారైన హైదర్.. హైదరాబాద్ నగరంలో తలదాచుకున్నాడు. దీంతో అతని కోసం ఒడిశా పోలీసుల సమాచారంతో తెలంగాణ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

హైదర్‌ను పట్టేసిన హైదరాబాద్ పోలీసులు
హైదర్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. వెంటనే ఒడిశా పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అతడ్ని భువనేశ్వర్ పోలీసులు ఒడిశాకు తరలించనున్నారు. మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిని పట్టుకున్న తెలంగాణ పోలీసులకు ఒడిశా పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, హైదర్ సహచరుడు యాకూబ్‌ను పోలీసులు ఇటీవల రిమాండ్ కు తీసుకున్నారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. యాకూబ్ సంచలన విషయాలను వెల్లడించాడు.

పోలీసుల సహకారంతోనే తప్పించుకున్న హైదర్?
ప్రతి రోజు ఒక హోటల్ నుంచి బిర్యానీ, కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఆస్పత్రిలో ఉన్న హైదర్‌కి ఇచ్చేవాడు యాకూబ్. ఆస్పత్రిలో హైదర్ క్యాబిన్ వద్ద కాపలాలో ఉన్న పోలీసులు అతనితో కలిసి బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగేవారు. ఈ క్రమంలో కాపలాగా ఉన్న పోలీసులకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి హైదర్ అక్కడ్నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, నిందితుడు పారిపోవడానికి అవకాశం ఇచ్చిన కానిస్టేబుల్ మహమ్మద్ మౌసిమ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కాగా, మరో ఐదుగురు పోలీసులు కూడా హైదర్ కు సహకరించినట్లు గుర్తించారు. వారి కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పుడు హైదర్ కూడా చిక్కడంతో అతడ్ని మరింత లోతుగా విచారించనున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications