కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో 600 కు పైగా వీధి కుక్కలు మృతి..!
కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో దాదాపు 600లకు పైగా వీధి కుక్కలు మృతి చెందాయి. విషం పెట్టి ఈ కుక్కలను చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలు గ్రామాల సర్పంచ్ లు, ఇతరులు మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీధి కుక్కలను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషంతో కూడిన ఇంజెక్షన్ లు, గుళికలు ఇవ్వడంతోనే వీధి కుక్కలు మృతి చెందినట్లు స్పష్టం అవుతోంది.
కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో దాదాపు 600 లకు పైగా వీధి కుక్కలు మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్ పేట్, బండరామేశ్వర్ పల్లి, భవానీపేట, వాడి తదితర గ్రామాల పరిధిలోని దాదాపు 600 లకు పైగా వీధి కుక్కలను చంపేశారు. ఇంజెక్షన్ లు, గుళికలు ఇచ్చి వీటిని హతమార్చారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ లు.. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి ఆధ్వర్యంలోనే ఈ చర్య జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో జంతు హక్కుల కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఐదుగురు సర్పంచ్ లపై కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. శునకాలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించారు. వాటి కళేబరాలను వెలికితీసి పంచనామా నిర్వహించారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు వీధి కుక్కల అంశంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కుక్కల దాడిలో గాయపడినా లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications