తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ!
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక వివాదాస్పద కేసులో బీఆర్ ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను దూషించారనే ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి, దర్యాప్తులో భాగంగా వాయిస్ శాంపిల్ ఇవ్వాలని పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ పరిణామానికి దారితీసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. గతంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.కరీంనగర్ సీపీ పెద్ద ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఎస్‌హెచ్‌వోలు, హోంగార్డుల ట్రాన్స్ఫర్లలో భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సీపీకి కేటాయించిన ప్రభుత్వ ఇన్నోవా వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తుల కోసం, ముఖ్యంగా హైదరాబాద్‌లో వేరే అవసరాల నిమిత్తం వాడుతున్నారని విమర్శించారు.

సీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆయనకు సంబంధించిన లీలలు, యాంటీ ఛాంబర్ మరియు హైదరాబాద్ రిసార్ట్స్‌లో జరిగిన విషయాలకు సంబంధించిన రహస్య వీడియోలు, ఫోటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని బయటపెడతానని హెచ్చరించారు.15 రోజుల్లో తప్పు సరిదిద్దుకోకపోతే ఆ వీడియోలను సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తానని, అసెంబ్లీ మీడియా పాయింట్లో కూడా బయటపెడతానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనపై వీణవంక పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అనంతరం ఈ దర్యాప్తును మరింత లోతుగా విచారించేందుకు సీఐడీకి బదిలీ చేశారు. కేసు దర్యాప్తు ప్రక్రియలో భాగంగా నిందితుడి గొంతు నమూనాలను సేకరించి, ఆడియో, వీడియో రికార్డులతో సరిపోల్చాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు వాయిస్ శాంపిల్ అందజేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులను మరియు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని వాదించారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాదులు వాదిస్తూ, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు కేవలం దర్యాప్తు ప్రక్రియలో భాగమని, ఇవి ప్రాథమిక స్వభావం కలిగినవి కాబట్టి పిటిషన్ చెల్లదని వాదించారు.
సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువడటంతో, పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల ఎదుట హాజరై తన వాయిస్ శాంపిల్స్ ఇవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత ఏర్పడింది.












Click it and Unblock the Notifications
