ఈ రాత్రి భయం గుప్పిట్లో తెలంగాణ.. ఓ వైపు భూకంపం.. మరోవైపు వడగండ్ల వర్షం
తెలంగాణలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అధికారుల అంచనా ప్రకారం సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది.
అటు కరీంనగర్ జిల్లాలోనూ చాలా చోట్ల స్వల్ప భూప్రకంపనలు జరిగాయని స్థానికులు వివరించారు. ఇక నిర్మల్ జిల్లాలోనూ 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే సింగరేణి ప్రాంతాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గడచిన నాలుగేళ్లలోనే ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆరు చోట్ల భూకంపాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగండ్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కరీంనగర్ లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 3 గంటలకు ప్రారంభమైన వర్షం మెల్లగా వడగండ్ల వానలాగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడినట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు.

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండలతో ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. భీకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, పంజాగుట్ట, కృష్ణా నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అకాల వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications