తెలంగాణాలో జనసేన రాజకీయమా.. పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ హెచ్చరిక!
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యకలాపాలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వెంటనే కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వచ్చినా, కమల కళ్యాణ్ వచ్చినా మాకేం బాధలేదు : టీపీసీసీ చీఫ్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వచ్చినా, కమల కళ్యాణ్ వచ్చినా మాకు ఎలాంటి బాధ లేదు. కానీ తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇక్కడికి వచ్చి ఇబ్బంది కలిగించాలని చూస్తే తాము సహించమని హెచ్చరించారు.

తెలంగాణా కాంగ్రెస్ సర్కార్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య వివాదం
సామరస్యంగా వస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టే స్ఫూర్తితో ఉన్నామని, కానీ రాజకీయ జోక్యం చేసుకుంటే మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతి లభించకపోవడంతో ప్రారంభమైన వివాదం తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
జనసేన పార్టీ తెలంగాణలో క్యాడర్‌ను బలోపేతం చేసే అడుగులు
ఇటీవల ఢిల్లీలో జరిగిన సేన ప్రస్థానం కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా హనుమకొండలో అనారోగ్యంతో ఉన్న తన అభిమాని నిరంజన్‌ను పరామర్శించడం ద్వారా తెలంగాణపై ఆయన దృష్టి సారిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జనసేన పార్టీ తెలంగాణలో క్యాడర్‌ను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంబంధాలపై కూడా ప్రభావం
ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో స్థిరమైన పాలన అందిస్తున్నందున ఇతర పార్టీల జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేస్తోంది.ఈ వివాదం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో పార్టీని విస్తరించాలని చూస్తున్నారు. దీనికి కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications