తెలంగాణా మీ అయ్య జాగీరా అనటం తప్పా? సమర్ధించుకున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 'తెలంగాణ మీ అయ్య జాగీరా' అని అనడం తప్పా అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. అయితే, తన మాటల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ వివరంగా తెలియజేశారు.
దేశ ఐక్యతను ప్రతిబింబించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలు దేశ ఐక్యతను ప్రతిబింబించేలా చేశానని చెప్పారు. భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ ప్రాంతానికైనా వెళ్లి తన అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని, ఇది ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని తాను స్థాపించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అక్కడ లక్షన్నర మంది సభ్యులు ఉన్నారని, వారి కోసం పనిచేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదన్న పవన్ కళ్యాణ్
జనసేన కేడర్‌లు ఉత్సాహంగా ఉన్నప్పుడు వారిని విస్మరించడం ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని, అయితే విభజన జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించానని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. గత 13 నెలలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, అందుకు స్పందించడం తప్పు కాదని అన్నారు.హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పుడు మరింత విస్తృతమైంది.
ఉత్తర-దక్షిణ భావనలు పెంచడం దేశ ఐక్యతకు మంచిది కాదన్న పవన్
తెలంగాణలోకి అడుగుపెట్టనివ్వనని కొందరు నేతలు చెప్పడం తన హక్కులపై దాడి అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉత్తర-దక్షిణ భావనలు పెంచడం దేశ ఐక్యతకు మంచిది కాదని, ఇలాంటి వైఖరులు దేశానికి ప్రమాదకరం అని హెచ్చరించారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా, ఎవరైనా మాట్లాడవచ్చని, ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు.
తాను హైదరాబాద్ వస్తే సమస్య దేనికి
పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న ఏకత్వ భావనను బలపరచడానికే అని తెలిపారు. రాహుల్ గాంధీ దక్షిణాదిని సందర్శిస్తే సమస్య లేదు కానీ తాను హైదరాబాద్ వస్తే సమస్య అనడం ఎందుకని ప్రశ్నించారు. ఈ దేశం అందరిదీ అని, ఎక్కడికైనా వెళ్లి ప్రజలతో మమేకం కావాలని తన ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications