టార్గెట్ 2024: బీసీలకు అండగా ఉంటానంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు(బీసీ) హక్కుల కోసం ఉద్యమించే సమయంలో అంతా ఏకమవుతున్నారనీ, ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బీసీల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. మంగళవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్‌ని కలిశారు. 23వ తేదీన హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించే జాతీయ స్థాయి సెమినార్‌కి పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించారు.

రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి కులగణన, రిజర్వేషన్ల కల్పనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తికి నేను కట్టుబడి ఉన్నాను. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆ కులాలకు స్వయం ప్రతిపత్తి, రాజ్యాధికారం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. బీసీల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు.
'ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా అసలు సమయానికి ఆచరణకు నోచుకోవడం లేదు. అందుకు రాజకీయపరమైన అవగాహన అవసరం. అందుకు సంబంధించి మథనం జరగాలి. యువతకు నాయకత్వాన్ని అప్పగించాలి. రాజకీయంగా ముందుకు వెళ్లాలి. బీసీ ఉద్యమానికి మద్దతుగా నా వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతాను' అన్నారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ నాయకులు ప్రజీత్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యర్రా సత్యనారాయణ, జక్కల వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శులు సుధాకర్ ముదిరాజ్, పెద్దవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది ఇలావుండగా, తెలంగాణలో జనసేన పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల తెలంగాణలో పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటేందుకు జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు సన్నద్దం కావాలని పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జనసేన పార్టీకి ఓటు వేయడం వల్ల జరిగే మంచిని తెలంగాణ ప్రజలకు వివరించాలని కోరారు. క్రియాశీలక సభ్యులంతా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను పూర్తిగా అవగతం చేసుకుని, వాటికి క్షేత్ర స్థాయిలో ప్రచారం కల్పించాలని తెలిపారు. గత శనివారం హైదరాబాద్ నగర శివారు చేవెళ్ల రోడ్డులోని జెపిఎల్ కన్వెన్షన్లో జరిగిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర క్రియాశీలక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి క్రియాశీలక కార్యకర్త 500 మందికి పార్టీని చేరువ చేసే లక్ష్యంతో పని చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications