ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రజలు తీర్పిచ్చారు : 400 సీట్లు మావే: పీఎం మోడీ!!
లోక్సభ ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని, నేడు నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పై నిప్పులు చెరిగారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలకు మాటిచ్చిన మోడీ ఒక్క అవినీతి పరుడిని వదలనని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని, గ్యారెంటీల అమలు పేరుతో గారడీలు చేస్తుందని అన్నారు. ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ ఎంతగానో కృషి చేసిందని మోడీ పేర్కొన్నారు. దేశమంతా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటుందని, తెలంగాణలో కూడా అదే గాలి వీస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు.

మరికాసేపట్లో ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పేర్కొన్న మోడీ, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రజలు ఫలితాలను ఇచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోమారు బిజెపి సర్కార్ వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే ఫలితం ఉంటుందని మోడీ తెలిపారు. నిన్న మల్కాజ్గిరి లో ఇదే చూశానని, అక్కడ ప్రజలు బిజెపిని ఆశీర్వదించారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలలో తీవ్ర కోపం కనిపించిందని.. అది వారిని ఓడించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు తన పట్ల ప్రజానీకమంతా ప్రేమ కురిపిస్తుందని పేర్కొన్న మోడీ తెలంగాణ రాష్ట్రంలోనూ అబ్ కీ బార్ మోడీ సర్కార్ అంటున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికలలో మూడోసారి కూడా బిజెపి నే మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గేట్ వే ఆఫ్ సౌత్ అంటారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం రాత్రి పగలుని ఏకం చేస్తానని పేర్కొన్న మోడీ తెలంగాణ రాష్ట్రంలో 17 కు 17 స్థానాలలో బిజెపిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని పేర్కొన్నారు. కాగా నాగర్ కర్నూల్ లో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు












Click it and Unblock the Notifications