ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు ప్రణీత్ రావు
ఫోన్‌టాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఈ కేసులో నిందితుడు ప్రణీత్ రావు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను.. సవాల్ చేస్తూ డీఎస్పీ ప్రణీత్ రావు తరఫు న్యాయవాది, హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా, కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్ రావు తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
కస్టడీ సమయంలో అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ప్రణీత్ రావు తన పిటిషన్‌లో తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. దర్యాప్తులోని అంశాలను అధికారులు మీడియాకు లీక్ చేస్తున్నారని, వాటిని ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు.

రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని, బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని చెప్పుకొచ్చారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని, ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు కోరారు. ప్రణీత్‌రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ హైకోర్టు విచారణ రేపటికి (బుధవారానికి ) వాయిదా వేసింది.
కాగా, ఫోన్ ట్యాపింగ్, సమాచారం ధ్వంసం చేసిన నేపథ్యంలో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారించిన పోలీసులు.. కీలక సమాచారాన్ని సేకరించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావును విచారించిన పోలీసులు, ఎవరూ లోనికి రాకుండా, మీడియా కంటపడకుండా గేట్లు మూసి వేశారు.
ఎస్‌ఐబీలో అతనితో పాటు పని చేసిన ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నించారు. డిసెంబర్ 4వ తేదీన ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఎవరెవరు సహకరించారని ప్రణీత్ రావును ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలు, ఐఎంఈఐ నంబర్లు, సీడీఆర్, ఐపీ అడ్రస్‌ల డేటాను సేకరించారని అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ధ్వంసం చేసి, కొత్తవి ఎందుకు అమర్చాల్సి వచ్చిందని ప్రణీత్‌ను ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది.
ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లను అడవుల్లో పడేశారు
కాగా, ధ్వంసం చేసిన ఆధారాలను ప్రణీత్ రావు.. వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో ప్రణీత్ ను స్వయంగా అక్కడకు తీసుకెళ్లి పడేసిన ప్రాంతంలో పోలీసులు గాలించనున్నారు. రెండో రోజు విచారణ సందర్భంగా హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రణీత్‌ను వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలు వెతికి, స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు, ప్రణీత్ రావుకు సహకరించిన ఇద్దరు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిరిసిల్లతోపాటు వరంగల్‌లోనూ ప్రణీత్ రావు సర్వర్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications