తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై తేల్చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్: ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి స్పష్టతనిచ్చారు. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని అన్నారు. బుధవారం లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ధాన్యం సేకరణ పలు అంశాలతో ముడిపడి ఉంటుందన్న కేంద్రమంత్రి
ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయన్నారు. కనసీ మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితుల ఆధారంగానే సేకరణ జరుగుతుందని లోక్‌సభలో తెలిపారు. గోధుమలు, వరి ధాన్యాన్ని నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరించాల్సిన ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ఎంఎస్పీకి ముడి ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. అలా సేకరించిన ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.

తెలంగాణ మంత్రులకు అపాయింట్ ఇవ్వాలని కేకే సహా టీఆర్ఎస్ ఎంపీలు
మరోవైపు, రాజ్యసభ లాబీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నలుగురు మంత్రులు ఢిల్లీకి వచ్చారని, వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కేంద్రమంత్రి గోయల్‌ను కేశవరావు కోరారు. దీనిపై స్పందిస్తూ.. కేంద్రమంత్రిగా తనకున్న షెడ్యూల్, పార్లమెంట్, ఇతరత్రా సమావేశాల టైమింగ్ చూసుకుని చెప్తానని తెలిపినట్లు తెలిసింది.

పీయూష్ గోయల్‌తో రేపు తెలంగాణ మంత్రులు భేటీ అయ్యే ఛాన్స్
కాగా, అపాయింట్ మెంట్ లభిస్తే గురువారం తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రి గోయల్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి మొత్తం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కోరే అవకాశం ఉంది. ఈ విషయంపై తాజాగా, సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి మొత్తం ధాన్యాన్ని సేకరించాలని కోరారు. కాగా, తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేతలు అంటుండగా.. మొత్తం ధాన్యం కొనుగోలు చేసే వరకూ తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications