తెలంగాణ వీర యోధుడి గురించి యావత్ దేశానికి తెలియజేసిన ప్రధాని మోదీ
PM Modi's Mann Ki Baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న రేడియో కార్యక్రమం మన్ కీ బాత్. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు బ్రాడ్‌కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన దీన్ని కొనసాగిస్తూ వస్తోన్నారు. ఆ ఏడాది అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
ఈ నెలలో ఇదే చివరి ఆదివారం కావడం వల్ల నేడు 127వ మన్ కీ బాత్ కార్యక్రమం టెలికాస్ట్ అయింది. ఇందులో తెలంగాణ వీర యోధుడు కొమరం భీమ్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భీమ్ గొప్పతనం, త్యాగం, పోరాటాల గురించి దేశ ప్రజలందరికీ వివరించినట్టయింది.

20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో స్వాతంత్ర్య ఆశలు పూర్తిగా సన్నగిల్లిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో బ్రిటిషు పాలకులు దేశం అంతటా అణచివేతకు పాల్పడ్డారని, ప్రజలను విపరీతంగా దోచుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని దేశభక్తులకు ఆ కాలంలో అణచివేత మరింత భయంకరంగా ఉండేదని, బ్రిటీష్ పాలకులతో పాటు క్రూరత్వం నిండిన నిజాం పాలకుల అకృత్యాలను కూడా వారు భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
పేదలు, అణగారిన వర్గాలు, గిరిజన ప్రజలపై అంతులేని అమానుష దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి కష్ట పరిస్థితుల్లో 20 సంవత్సరాల వయస్సున ఓ యువకుడు ఈ అణచివేతకు ఎదురుతిరిగారని, అన్యాయాన్ని ఎదిరించిన నిలిచారని ప్రధాని మోదీ చెప్పారు. నిజాం పాలకులు, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు వచ్చాడని గుర్తు చేశారు.
ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ యువకుడు నిజాం అధికారిని సైతం హతమార్చాడని, అరెస్టు కాకుండా తప్పించుకోవడంలో విజయవంతమయ్యాడని మోదీ తెలిపారు. ఆ యువకుడే కొమరం భీమ్.. అని యావత్ దేశానికి పరిచయం చేశారు. అక్టోబర్ 22వ తేదీన ఆయన జయంతి జరుపుకొన్నామని చెప్పారు. కొమరం భీమ్.. ముఖ్యంగా గిరిజన సమాజంలోని లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రధాని అన్నారు. వీలైనంత ఎక్కువ ఆయన గురించి తెలుసుకోవాలని మోదీ ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications