ప్రధాని మోదీ సంచలన ప్రకటన - తెలంగాణ ఎన్నికల్లో బిగ్ టర్న్..!?
తెలంగాణ ఎన్నికల వేళ సంచలన ప్రకటనకు ప్రధాని మోదీ సంచలన ప్రకటనకు సిద్దమయ్యారు. ఇప్పటికే బీసీ సీఎం నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. తెలంగాణ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య సాగుతున్న వేళ..సామాజిక సమీకరణాలో గేమ్ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు హైదరాబాద్ వేదిక కానుంది. బీజేపీ వేస్తున్న వ్యహాత్మక ఎత్తుగడలతో బీఆర్ఎస్ - కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అస్త్రం: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్దమైంది. శనివారం సికింద్రాబాద్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 'అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ'కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేదికపై నుంచే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాన్ని మోదీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని, అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని ప్రధాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో బీసీల సభకు మోదీ వచ్చిన సందర్భంగా ఆయనతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. షెడ్యూలు కులాల వర్గీకరణపై మోదీ కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత: బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశం హామీ తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టనుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నినాదాలతో రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీల సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకోనున్న చర్యలపై ప్రకటనలు చేస్తే అది ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పడేస్తుందని, వారికి విమర్శలు చేసే అవకాశం ఉండదని ముఖ్యనేతలు భావిస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణ-చట్టబద్ధత అంశంపై పార్టీలో అంతర్గతంగా గత ఐదు నెలలుగా కసరత్తు జరిగిందని, ఆ తర్వాతే ప్రధాని కీలక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తెలంగాణాలో ఎస్సీల ఓట్లు 18శాతం ఉండగా.. అందులో 14శాతం మాదిగలే. ఇందులో ఒకటి, రెండుశాతం పోయినా, మెజారిటీ మాదిగలు తమకే అండగా ఉంటారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

బీజేపీ వ్యూహం ఫలించేనా: బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఎస్సీ రిజర్వ్ అయిన 19 స్థానాలతో పాటు జనరల్ అయిన నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోనూ ఎస్సీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 22 స్థానాల్లో 14 స్థానాలను మాదిగలకే ఇవ్వడం గమనార్హం. బీసీ ఓటుబ్యాంకుపైనా ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ, అందుకు అనుగుణంగా టికెట్ల కేటాయింపులోనూ వారికి ప్రాధాన్యమిచ్చింది. 36 స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టింది.
ఈ 36 స్థానాల్లో 20కి పైగా స్థానాల్లో బండి సంజయ్, ఈటల, ధర్మపురి అర్వింద్ తదితరులను పార్టీ రంగంలోకి దింపింది. తెలంగాణాలో ఎస్సీల ఓట్లు 18శాతం ఉండగా.. అందులో 14శాతం మాదిగలే. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపారు. మరోసారి 2018లోనూ డిమాండ్ చేశారు. ఎస్సీ కోటాను 15శాతానికి మించి పెంచాలని కూడా 2021లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేశారు. దీంతో, అంచనా వేస్తున్నట్లు ప్రధాని ఈ ప్రకటన చేస్తే ఎన్నికల వేళ తెలంగాణలో బిగ్ టర్న్ అవుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications