భాగ్యలక్ష్మి దేవాలయానికి ప్రధాని మోదీ - కీలక ప్రకటనల దిశగా : షెడ్యూల్ ఇలా..!!
బీజేపీ కార్యవర్గ సమావేశాల వేళ..బాగ్యలక్ష్మీ దేవాలయం కీలకంగా మారుతోంది. పార్టీ ముఖ్య నేతలు భాగ్యలక్ష్మీ దేవాలయం సందర్శనకు ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ లో ఏర్పాట్లు తుది దశకు చేరాయి. నగరం మొత్తం కాషాయ జెండాలు - ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. రేపటి (శుక్రవారం) నుంచి బీజేపీ అగ్రనాయకత్వం హైదరాబాద్ నగరంలో బస చేయనుంది. జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాట్ల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సమావేశాల నిర్వహణకు - ముఖ్య నేతల పర్యటనలు - వారి సమావేశాల కోసం ప్రత్యేకంగా పార్టీ నేతలతో టీంలు ఏర్పాటు చేసారు.

భాగ్యనగరం కాషాయమయం
ఇక, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై 1న, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు. పార్టీ నేతల కోసం ప్రత్యేకంగా వసతి సిద్దం చేసారు. ఇందు కోసం జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు నోవాటెల్‌లో 270 గదులు కేటాయించారు. మరికొందరికి వెస్టిన్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎగ్జిక్యూటివ్ సూట్లు, ముఖ్యమంత్రులకు జూనియర్ సూట్లు కేటాయించారు. ప్రధాని మోదీ కోసం రెండు చోట్ల బస సిద్దం అవుతోంది. ప్రధాని మోదీ రెండు రోజులు నగరంలోనే ఉండనున్నందున ఆయన బస ఏర్పాట్లపై ఎస్పీజీ, కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చర్చలు చేస్తున్నారు. భారీ బందోబస్తు తో పాటుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రధాని భాగ్యలక్ష్మి దేవాలయ సందర్శన
జులై 2న మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. అదే రోజు రాత్రి నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నట్టు సమాచారం. అక్కడి ప్రెసిడెన్షియల్ సూట్‌ను మోదీ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జులై 3న బహిరంగ సభ అనంతరం ఆ రోజు రాత్రి ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పాటుగా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శిస్తారని.. దీని పైన అధికారికంగా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా - యూపీ సీఎం యోగీ ఈ దేవాలయాన్ని సందర్శించారు. సమావేశాలు ముగిసిన తరువాత 4వ తేదీన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు.
Recommended Video


ప్రధాని ప్రసంగం - ప్రకటనలపై ఆసక్తి
బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం ఇది రెండోసారి. 18 ఏళ్ల కిందట 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి, ఉప ప్రధాని అద్వానీతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో వెంకయ్యనాయుడుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే కీలక తీర్మానం జరిగింది. సంకల్పం-2004 నినాదంతో నాటి సమావేశాలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డి.కె.అరుణ, వివేక్, జితేందర్‌రెడ్డి, రాజాసింగ్, గరికపాటి మోహన్‌రావు, లక్ష్మణ్, విజయశాంతి, ఆంధ్రప్రదేశ్ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు పాల్గొననున్నారు. ఇక, బహిరంగ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications