వారిద్దరూ నాకు రెండు కళ్లు: రేవంత్ రెడ్డి
Revanth Reddy: భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం.. తెలంగాణలో దుమారం రేపుతోంది.
మరోవంక- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సవాల్ విసిరారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముస్లిం సామాజిక వర్గానికి ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీనికి హాజరయ్యారు. జంటనగరాలకు చెందిన వేలాది మంది ముస్లింలో ఇందులో పాల్గొన్నారు.
వారిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని తేల్చి చెప్పారు. ముస్లింల రిజర్వేషన్‌ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల గానీ, అమిత్ షా వల్ల గానీ కాదని స్పష్టం చేశారు.

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు.
హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని అన్నారు రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications