బీజేపీ విజయ సంకల్ప సభలో సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ వార్నింగ్!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో నేడు 6,100కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాలను నిర్వహించిన వేదికపై తెలుగులో ప్రసంగించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ తెలుగులోనే తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
భారత్ మాతా కీ జై అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టి సభలో భద్రకాళీ అమ్మావారిని తలుచుకున్నారు. భద్రకాళి మహత్యం, సమ్మక్క, సారలమ్మల పౌరుషం, రాణి రుద్రమ పరాక్రమం అంటూ మోడీ తెలంగాణా ప్రాశస్త్యాన్ని, చరిత్రను కొనియాడారు. చారిత్రక వరంగల్ కు తాను రావటం సంతోషంగా ఉందన్న ప్రధాని మోడీ తన రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారు.

తెలంగాణలో 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‌కు బీజేపీ తన ట్రైలర్ చూపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వరంగల్ సభకు వచ్చిన ప్రజలను చూస్తే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే ధీమా కలుగుతోందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇన్నేళ్లలో కేవలం నాలుగు పనులను మాత్రమే చేస్తోందని ప్రధాని మోడీ సెటైర్ వేశారు.
మోడీని ప్రతీ రోజూ తిట్టడం, కుటుంబ పార్టీలను పెంచి పోషించడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, రాష్ట్రాన్ని అవినీతిలో కూరుకుపోయేలా చేయడం వంటి ఈ నాలుగు పనులే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు.
వారు చేసే అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురి పెట్టాయని ప్రధాని మోడీ తెలిపారు. వాళ్ళు చేసిన స్కాం ల నుంచి ప్రజల దృష్టిని మార్చేందుకు కేసీఆర్ కొత్త నాటకాలకు తెర తీశారని అన్నారు. తెలంగాణలో స్కాంలేకుండా ఉన్న స్కీంలు, ప్రాజెక్టులు లేవని ఆరోపించారు. కుటుంబం, బిడ్డల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
తెలంగాణ బిడ్డలు ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు . రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రమాద కరంగా మారాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను పత్తా లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications