నిజాం రాజులు వేటాడిన ప్రదేశం.. హైదరాబాద్ కు 110 కి. మీ. దూరంలో..!
తెలంగాణను శాతవాహనుల నుంచి నిజాం రాజుల వరకు అనేక సామ్రాజ్యాలు పరిపాలించాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం రాజులు పలు విధాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. నిజాం ప్రభువుల పరిపాలనలో హైదరాబాద్ సామ్రాజ్యం విస్తరించింది. హైదరాబాద్ ను మొత్తం ఏడుగురు నిజాం ప్రభువులు పరిపాలించారు. అయితే అందులో ఆరో నిజాం అయిన మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కు వేట అంటే ఇష్టం అని పలు ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ వారాంతాల్లో వేటకు వెళ్లేవారు. ఆయన పోచారం ప్రాంతంలోని అడవుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ దాదాపు 33 మందిని తినేసిన రెండు పులులను వీరోచితంగా వేటాడి హతమార్చినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. పులులను వేటాడి చంపి.. ప్రజలకు వాటి నుంచి విముక్తి కలిగించినందుకు గాను మీర్ మహబూబ్ అలీ ఖాన్ కు తీస్ మార్ ఖాన్ అనే బిరుదు కూడా వచ్చింది.
ఇక నిజాం ప్రభువులు వేటాడిన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా..? అదే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ.. పోచారం వన్యప్రాణుల అభయారణ్యంగా పేరు గాంచిన ఈ ప్రదేశం తెలంగాణ మెదక్ జిల్లాలోని పోచారంలో ఉంది. ఇప్పుడు ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా మారింది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా పర్యటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 5,600 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అభయారణ్యంలో 600 కు పైగా జింకలు సహా నెమళ్లు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు తదితర వన్యప్రాణులు ఉన్నట్లు సమాచారం.
అలాగే పోచారం అభయారణ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ సందర్శకులు జంతువులను దగ్గరగా వీక్షించవచ్చు. ఈ సఫారీ టికెట్ ధరలు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 గా ఉన్నాయి. వీరితో పాటు గైడ్ సాయంతో సఫారీ చేస్తుంటారు. విద్యార్థుల కోసం వన్యప్రాణుల మోడల్స్, ఫొటోలు, టీవీ ప్రదర్శనల ద్వారా విద్యాపరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. మెదక్ పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు సరైన ప్రదేశంగా మారింది.

పోచారం వన్యప్రాణుల అభయారణ్యాన్ని చూసేందుకు హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications