లిక్కర్ మాఫియా కొత్త దారులు.. పోలీసుల కంటపడకుండా ఎలా తరలిస్తున్నారో తెలుసా..
లాక్ డౌన్‌లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపి ఒక్కో ఫుల్ బాటిల్‌ను నాలుగైదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తోంది. మందుబాబుల బలహీనతపై దెబ్బ కొడుతూ భారీ మొత్తంలో క్యాష్ చేసుకుంటోంది. అధికారుల నిఘా పెరిగినప్పటికీ.. కొత్త దారుల్లో వారి కంటపడకుండా మద్యం విక్రయిస్తోంది. అధికారుల తాజా తనిఖీల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పటాన్‌చెరు,మెదక్,భువనగిరి,మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఇక్కడికి మద్యం అక్రమ రవాణా అవుతున్నట్టు గుర్తించారు. అది కూడా పోలీసులు గుర్తించకుండా.. ట్రాలీ వెనుక భాగం కింద ప్రత్యేక అరను ఏర్పాటు చేసి మద్యం తరలిస్తున్నట్టు గుర్తించారు.
తాజాగా మహబూబ్‌నగర్‌లోని ఓ వైన్ షాపులో తనిఖీలు చేయగా.. లోపల మద్యం బాటిళ్లు కనిపించలేదు. దీంతో యజమానిని ఆరా తీయగా తనకేమీ తెలియదని సమాధానమిచ్చాడు. ఇక్కడినుంచి లిక్కర్ బాటిల్స్ అన్నీ బ్లాక్ మార్కెట్‌కి తరలించినట్టుగా అనుమానిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాధారణ రోజుల్లో రూ.120-రూ.180 వరకు ఉండే బీర్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.500 పైనే విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.680 విలువ చేసే రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.4వేలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. బ్లెండర్ స్ప్రైడ్,సిగ్నేచర్ వంటి బ్రాండ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

లాక్ డౌన్ పీరియడ్‌లో మద్యం షాపులను సీజ్ చేయకుండా వదిలేయడం వల్లే బ్లాక్ మార్కెట్‌కు తెరలేచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం అన్ని రాష్ట్రాల్లోని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేరళ మాత్రం తమ రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 5వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో లాక్ డౌన్ పొడగింపు,మద్యం అమ్మకాలు,ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications