రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు.. అరెస్ట్ హెచ్చరిక!
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కు మోకిలా పోలీసులు నోటీసులను జారీ చేశారు. బి ఎన్ ఎస్ ఎస్ 35 (3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించి ఆయనను విచారించాలని నోటీసులలో పోలీసులు పేర్కొన్నారు.
రాజ్ పాకాల కు పోలీస్ నోటీసులు
ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు .అడ్రస్ ప్రూఫ్ లతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు ఇక విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు నోటీసులలో హెచ్చరికలు జారీ చేశారు.

మోకిలా ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను ఆయన ఇంటికి అతికించిన పోలీసులు
పోలీసులకు రాజ్ పాకాల అందుబాటులోకి రాకపోవడంతో మోకిలా ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో రాజ్ పాకాల నివాసానికి అతికించారు పోలీసులు. అంతే కాదు ఈరోజు విచారణకు హాజరు కాకపోతే బి ఎన్ ఎస్ ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా ఆ నోటీసులలో వెల్లడించారు. అయితే ఆయన నేడు విచారణకు హాజరు కాలేదు.
కోర్టుకు రాజ్ పాకాల
ఇక ఇదిలా ఉండగా రాజ్ పాకాల ఈ కేసులో హైకోర్టును పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఆశ్రయించారు. అత్యవసర పిటీషన్ను దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఆయన పోలీసులు తన అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
అరెస్ట్ తప్పదా?
తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక భోజన విరామం తర్వాత జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్ పైన విచారణ జరుపనున్నారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఏం చేయబోతుంది? ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. కాగా నోటీసులను ఇచ్చిన పోలీసులు విచారణకు హాజరు కాని రాజ్ పాకాలను అరెస్ట్ చేస్తారా? కోర్టు ఏం చెప్తుంది? పోలీసులు ఈ కేసులో ఏం చెయ్యబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications