హరీష్ Vs మైనంపల్లి - సిద్దిపేటలో బస్తీ మే సవాల్..!!
సిద్దిపేటలో రాజకీయ టెన్షన్ కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కొందరు దాడి చేసారు. ఆ దాడి వెనుక మైనంపల్లి కుమారుడు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసారు. ఫ్లెక్సీలు తొలిగించారు. ఇప్పుడు మరోసారి సిద్దిపేట కేంద్రంగా హరీష్ వర్సస్ మైనంపల్లి రాజకీయం ఉత్కంఠా మారుతోంది.
పోటా పోటీగా
సిద్దిపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటా పోటీగా సమావేశాలు ఏర్పాటు చేసాయి. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రుణమాఫీపై సమావేశం ఏర్పాటు చేశారు. అటు మైనంపల్లి సిద్దిపేటల లో పర్యటన కు సిద్దమయ్యారు. హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేటలో హరీష్ ను ఓడించటమే తన లక్ష్యమని అప్పట్లో సవాల్ చేసారు. అప్పటి నుంచి మైనంపల్లి వర్సస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది.

సమావేశాలతో
ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మీటింగ్ ఏర్పాటు చేశారు. రుణమాఫీ అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమయంలో మైనంపల్లి ర్యాలీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్ లో మైనంపల్లి హన్మంతరావు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ఆఫీసు మీదుగా పాత బస్టాండ్ వద్దకు వెళ్లే విధంగా ప్లాన్ చేసారు.
బందోబస్తు
దీంతో, పోలీసులు కాంగ్రెస్ నేతల రూటు మార్చుకోవాలని కోరుతున్నారు. నిర్ణయించిన మార్గంలోనే వెళ్తే ఘర్షణలకు అవకాశం ఉందని భావిస్తున్నారు.కానీ, కాంగ్రెస్ నేతలు తాము ముందుగా నిర్ణయించిన మార్గం లోనే వెళ్తామని పట్టు బడుతున్నారు. దీంతో బ్లాక్ ఆఫీసు చౌరస్తాలో పోలీసులు భారీగా మొహరించారు. క్యాంపు కార్యాలయం వైపు కాంగ్రెస్ నేతలు రాకుండా చర్యలు చేపట్టారు. దీంతో..ప్రస్తుతం సిద్దిపేటలో రెండు పార్టీల కార్యక్రమాలతో రాజకీయంగా ఉద్రిక్తత ఏర్పడింది.












Click it and Unblock the Notifications