రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ఇమేజ్ మీకుందా? : మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు కౌంటర్
మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్వీట్‌లో రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్‌కు లేదని, గాంధీ కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని గుర్తు చేశారు.పొన్నం ప్రభాకర్ మాజీ పాలనపై వరుస ప్రశ్నలు వేశారు. నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి మీ సారధ్యంలోనే జరిగింది కదా అని అడిగారు.
ఖమ్మంలో రైతులకు బేడీలు వేయించిన సంఘటన మీ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. మల్లన్న సాగర్ బాధితులపై లాఠీ ఛార్జ్ చేసిన సంఘటన కూడా మీ పాలనలోనే జరిగిందని ఎత్తి చూపారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చాం, నిర్వహించి చూపించామని సవాల్ విసిరారు.

మేము హామీలు ఇవ్వడమే కాదు, అమలు చేసే సత్తా కూడా ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మీలాగా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాలనే ఆసక్తి మాకు లేదు, అవసరం కూడా లేదని చెప్పారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతి గురించి మీరు మాట్లాడటం వింతగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అసైన్డ్ ల్యాండ్లు వంటి అంశాలను లెక్క పెట్టుకుంటూ పోతే మీ అవినీతి లెక్కలు చెప్పడానికి ఒక ఏడాది పడుతుందని ఎద్దేవా చేశారు.మీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్భాటాలు, ఆడంబరాలతో మా ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న ఏర్పాట్లను పోల్చి చూస్తే అబద్ధం కూడా సిగ్గుపడుతుందని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
రాజకీయ విమర్శలు చేసేటప్పుడు గత పాలనలో జరిగిన సంఘటనలను మర్చిపోకూడదని సూచించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పనిచేయాలని, ఆస్తుల సంపాదన, అవినీతి వంటి అంశాలపై నోరు మెదపకూడదని స్పష్టం చేశారు.ఈ కౌంటర్ ట్వీట్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తోందని నొక్కి చెప్పారు. రాజకీయ వేదికపై జరుగుతున్న ఈ వాదోపవాదాలు తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని చర్చలకు దారితీయనున్నాయి.












Click it and Unblock the Notifications
