ఇన్‌స్పెక్టర్ దుర్గారావుపై వేటు: ప్రజాభవన్ వద్ద రాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు
హైదరాబాద్: ప్రజా భవన్ వద్ద రాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. రాష్ డ్రైవింగ్ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కేసు విచారణలోనిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును సస్పెండ్ చేశారు.
ఈ కేసులో కారును రాష్‌గా డ్రైవింగ్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ను తప్పించి మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావు సస్పెన్షన్‌కు కారణమయ్యాయి. ఉద్దేశపూర్వకంగా విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఆయనపై వేటు పడింది.

డిసెంబర్ 23న ప్రజా భవన్ ఎదుట బారీకేడ్లను షకీల్ కుమారుడు సాహిల్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులతోపాటు మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు తెలిసింది. కారు రాష్ డ్రైవింగ్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, ఈ కేసులో సాహిల్ ను తప్పించి మరొకరు కారు నడుపుతున్నట్లు అప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కుమారుడు సాహిల్ అని తేల్చారు పోలీసులు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కాగా, డిసెంబర్ 23వ తేదీన వేకువజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. ఘటనలో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications