జాతరకు వేళాయే.. రేపటి నుంచే పెద్దగట్టు జాతర ప్రారంభం
యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే.. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దగట్టు జాతర ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే పెద్దగట్టు జాతరకు ఇప్పటికే సర్కార్ నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ఈమేరకు జిల్లా ప్రజల తరఫున సీఎం రేవంత్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
60 ప్రత్యేక బస్సులు..
పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. సూర్యాపేట నుండి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 అని వివరించారు. జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖవంతమని అన్నారు.

ఏర్పాట్లు పూర్తి..
పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, ఇతర అధికారులతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications